=ఆర్‌ఎంపీల అమానవీయ ప్రవర్తన
=ఒక్కో పరీక్షకు రూ. 5,500 వసూలు
=తారుమారుతో రచ్చకెక్కిన బాధితులు
=మొగుళ్లపల్లి మండలంలో వెలుగులోకి...
=సెటిల్మెంట్ చేసిన పెద్ద మనుషులు
=రూ.50 వేలతో సద్దుమణిగిన గొడవ?
పుట్టకముందే తల్లి కడుపులో పెరుగుతున్న బంగారు తల్లుల ప్రాణం తీస్తున్నారు. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే కాసులకు కక్కుర్తిపడి ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ... నీచానికి పాల్పడుతున్నారు. ఆడపిల్లని తేలితే కనికరం లేకుండా అబార్షన్లు చేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి యాజమాన్యం సహకారంతో మొగుళ్లపల్లి మండలంలోని ఆర్‌ఎంపీలు గుట్టుగా ఈ దందా సాగిస్తున్నారు. ఇటీవల రెండు కేసులు ఫెరుుల్ కావడం... బాధితులు రచ్చకెక్కడంతో వారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
మొగుళ్లపల్లి, న్యూస్‌లైన్ :జిల్లాలోని పలువురు ఆర్‌ఎంపీలు సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. కాసుల కక్కుర్తితో మగ సంతానం కావాలనుకునే దంపతులను గుర్తించి వారితో ముందస్తుగా సంప్రదింపులు జరిపి అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా... ఆర్‌ఎంపీల సహకారంతో కొంతమంది వైద్యులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. లోకం చూడక ముందే ఆడ శిశువులను బలిగొంటున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు, పోలీసుల పట్టింపులేమితో జిల్లాలో ఈ దందా మూడు పు వ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది.
భీమారం సమీపంలో...
మీకు కలుగబోయే బిడ్డ ఆడనో... మగనో చెబుతాం. ఒకవేళ పుట్టే శిశువు ఆడ అయితే మేమే అబార్షన్ చేయిస్తాం. రహస్యంగా ఉంచితేనే మీ పని జరుగుతుందంటూ ఆర్‌ఎంపీలు నమ్మబలుకుతున్నారు. లింగనిర్ధారణకు రూ. 5,500 ఖర్చవుతుందని... డాక్టర్‌తో అన్ని విషయాలు తామే మాట్లాడుతామని మీరేమి మాట్లాడొద్దని మాట తీసుకుని బాధితులను హన్మకొండ శివారు భీమారం సమీపంలోని ఓ ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. అక్కడ స్కానింగ్ తీయించి రిపోర్టులు వచ్చాక పుట్టబోయేది మగశిశువని తేలితే... అదే విషయం సదరు గర్భిణికి చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఆడ శిశువని తేలితే సదరు కుటుంబ సభ్యులకు చెప్పి.. అబార్షన్‌కు సిద్ధం చేస్తున్నారు.
వెలుగు చూసిందిలా...
మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు, మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులకు ఓ ఆర్‌ఎంపీ లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. పరీక్షల్లో మగ సంతానమేనని తేలినట్లు నమ్మించాడు. తీరా వారికి ఆడపిల్లలు జన్మించా రు. వారికి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మరో ఆడ సంతానం ఎట్లా అని బాధితుల కుటుంబ సభ్యులు సదరు ఆర్‌ఎంపీని నిలదీశారు. విషయం బయటకు పొక్కడంతో పెద్దమనుషుల సమక్షంలో పొరపాటు జరిగిందని ఒప్పుకుని.. రూ.50,000 చెల్లిస్తామని స్టాంప్ పేపర్లపై రాసిచ్చినట్లు సమాచారం.
ఆ ఆస్పత్రిలో జరిగిన భ్రూణ హత్యలెన్నో ?
లింగనిర్ధారణ పరీక్షల్లో పుట్టబోయేది ఆడపిల్లని తెలిసి హన్మకొండలోని ఆస్పత్రి వైద్యులు, ఆర్‌ఎంపీలు ఎన్ని భ్రూణ హత్యలకు పాల్పడి ఉంటారనేది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. లోకం చూడకముందే గర్భస్థ శిశువుల ప్రాణం తీయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
పిండానికి గండం
Published Fri, Dec 20 2013 5:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement