డేంజర్ జోన్
పుస్తకాలు పట్టాల్సిన స్కూల్/కాలేజీ విద్యార్థులు ఈ మధ్య ట్యాబ్, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, నెట్ బ్రౌజింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హోంవర్క్, చదువు, భోజనం ఇలా అన్నీ మరిచి వాటికి బందీలుగా మారుతున్నారు. వ్యసనంగా మారి చివరకు చదువులో వెనుకబడి మానసిక వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగరంలో ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ వారు పలు సూచనలు చేస్తున్నారు.
కరెన్సీన గర్‌కు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడటం, ఫేస్‌బుక్ చూడటం, గేమ్స్ ఆడుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. రానురానూ ఇది వ్యసనంగా మారడంతో చదువుపై ధ్యాస తగ్గింది. మార్కులు ఎక్కువగా రావడం లేదని కళాశాల నుంచి అతని తల్లి దండ్రులకు ఫోన్ వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది.
పెనమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌పై వెళ్తూ ఫోన్‌లో మాట్లాడటం, నిత్యం ఇంటర్నెట్‌లో గేమ్స్ ఆడటం అలవాటుగా మార్చు కున్నాడు. దీంతో ఇటీవల కాలంలో మెడ మజిల్స్ పట్టేశాయి. తొలుత న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి అనంతనం ఫిజియో థెరపీ చేయించారు.
లబ్బీపేట : స్కూల్‌కు వెళ్లొచ్చాక పిల్లలు కాసేపు ఆడుకోవడం సహజం. ఇదంతా గతం. ప్రస్తుతం కాలం మారింది. కంప్యూటర్, వీడియో గేమ్స్, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ అందు బాటులోకి రావడంతో బయట ఆడుకునే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ఫోన్లు, నెట్ సదుపాయం అందుబాటులో ఉండటంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఒంటరిగా వాటితోనే గడుపుతున్నారు. అయితే, వీటిద్వారా వినోదం కలిగే మాట వాస్తవమే కానీ, ఇతర ఆటల ద్వారా కలిగే సమిష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవి ఉండవన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. గేమ్స్ పేరిట కంప్యూటర్, ట్యాబ్‌లకు అతుక్కుపోయే పిల్లలను మందలించాలి. గేమ్స్ పుణ్యమా అని కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయే చిన్నారులు అంతగా చదువుపై దృష్టిపెట్టలేక పోతున్నారు. అంతేకాదు.. కుటుంబ సభ్యులతో సరదాగా ఉండలేకపోతున్నారు. రోజుకు 3 నుంచి 4 గంటలపైనే కంప్యూటర్ గేమ్స్, ట్యాబ్స్, సెల్‌ఫోన్లలో మునిగిపోవడం సర్వసాధారణ విషయంగా మారింది. ఇలాంటి అలవాట్ల వల్ల కొందరిలో దుష్ర్పభావాలు తలెత్తుతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
తల్లిదండ్రులూ ఇలా చేయండి..
కంప్యూటర్ గేమ్స్ నుంచి పిల్లల దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. కంప్యూటర్ వినియోగంలో ముందే పరిమితి విధించాలి. ఇంట్లో అంతా సంచరించే ప్రాంతంలో కంప్యూటర్ ఉంచడం, అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో గమనించడం, కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవడం చేయాలి. సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్లకు పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలతో కలిసి తరచూ సరదాగా గడపడం చేస్తుండాలని, అలా చేస్తే పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోరని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యపరంగా పెను ప్రమాదమే..
తరచూ ట్యాబ్, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల మణికట్టు వద్ద కండరాల నొప్పి, మెడనొప్పి, కుంగుబాటు, భావోద్రేకాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. గేమ్స్ ఆడవద్దంటే ఒక్కసారిగా కోపోద్రిక్తులైపోతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడపరు. స్నేహితులతో చనువుగా ఉండరు. తమ భావాలను ఎదుటివారితో పంచుకోరు. హోంవర్క్ పూర్తి చేయకపోవడం, తరగతుల్లో పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.