సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీ సిబ్బందికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జీతాల్లేక విలవిల్లాడుతున్న సిబ్బందికి దసరా అడ్వాన్సులిచ్చేది లేదని సంస్థ యాజమాన్యం నిర్ణయించడం ఆ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ సిబ్బందికి ఏటా దసరా పండుగను పురస్కరించుకుని అడ్వాన్సులిస్తుంటారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు సహా ఆఫీస్ సిబ్బందికి రూ.3 వేలు, శ్రామికులకు (దిగువ స్థాయి సిబ్బంది)కి రూ.2వేల చొప్పున అడ్వాన్సులిచ్చి ఆ సొమ్మును పది వాయిదాల్లో వసూలు చేసుకునేలా అప్పట్లో ఒప్పందం జరిగింది. పండుగ ముందు ఇచ్చే ఈ అడ్వాన్సు కోసం ఆర్టీసీ కుటుంబాలు ఎంతో ఆశగా చూస్తుంటాయి.
ఈ సారి తమ వద్ద సరిపడా నిధుల్లేవని పేర్కొంటూ అడ్వాన్సులిచ్చేందుకు సంస్థ వెనకడుగు వేయడం సిబ్బందిలో ఆగ్రహం తెప్పిస్తోంది. పండుగలను పురస్కరించుకుని పర్వదినాల్లో అడ్వాన్సులివ్వడం ఆనవాయితీ. ఆగస్టు 12వ తేదీ అర్థరాత్రి నుంచి విశాఖ పరిధిలో సుమారు 5వేల మంది సమైక్యాంధ్ర ఉద్యమంలోకి దిగారు. పనిచేసిన 12 రోజులతో పాటు ఇప్పటివరకూ ఆర్టీసీ వేతనాలివ్వలేదు.
నోవర్క్..నో పే అంటూ వస్తోంది. మరోవైపు సంస్థ పరిధిలో ఎంతోమంది సీసీఎస్ (కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ) , ఎస్‌బీటీ (స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్) , ఎస్‌ఆర్‌బీఎస్ (స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం) వంటి రుణాలు కూడా కొన్నాళ్ల నుంచీ సంస్థ యాజమాన్యం ఇవ్వడం మానేసింది. రుణాలు తిరిగి చెల్లించినా మళ్లీ రుణాలివ్వటానికి యాజమాన్యం ఎందుకు సందేహిస్తోందో అంతుపట్టడం లేదని సిబ్బంది అంటున్నారు.
ఆందోళన ఉధృతం చేస్తాం
ఆర్టీసీ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. సమ్మె నేపథ్యంలో జీతాలివ్వలేదు. పోనీ అప్పు తీసుకుందామంటే రుణాలిచ్చేది లేదంటోంది. ఇప్పుడు దసరా అడ్వాన్సులూ ఇవ్వకపోతే ఎలా? ఈ విషయమై సంస్థకు బుధవారం సంఘం తరఫున లేఖలిచ్చాం. అడ్వాన్సు ఇచ్చి వాయిదాల చొప్పున మా జీతం నుంచి వసూలు చేసుకునేందుకు కూడా సంస్థ వెనకడుగు వేయడం ఘోరం. సర్క్యులర్ వెనక్కు తీసుకోకపోతే ఈ నెల 27నుంచి అన్ని డిపోల్లోనూ ఆందోళన చేసేందుకు నిర్ణయించాం.
-పలిశెట్టి దామోదర్‌రావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్
దసరా అడ్వాన్స్‌కు బ్రేక్...ఉద్యోగులకు షాక్
Published Thu, Sep 26 2013 2:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement
Advertisement