అనంతపురం క్రైం/గుత్తి/తాడిపత్రి/కంబదూరు, న్యూస్‌లైన్ : అనంతపురం నగరంలో ఆదివారం పట్టపగలే ఓ ఇంట్లోకి దొంగ జొరబడి దోపిడీకి పాల్పడ్డాడు. గుత్తి, తాడిపత్రి, కంబదూరు మండలం రాంపురంలో దొంగలు యథేచ్ఛగా చోరీలకు తెగపడ్డారు. దొంగలు చెలరేగిపోతున్నా.. పోలీసుల చర్యలు మాత్రం నామమాత్రంగా ఉంటున్నాయి. గస్తీ పకడ్బంధీగా నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనంతపురంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న రుచి ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని రమణ ఇంట్లో ఆదివారం ఉదయం దొంగ చొరబడి రూ.లక్ష నగదుతో పాటు 30 తులాల బంగారు నగలు దోచుకెళ్లాడు. బాధితుల కథనం మేరకు... రమణ ఉదయం 10.45 గంటలకు కుమార్తె దీక్షితకు పల్స్‌పోలియో చుక్కలు వేయించేందుకు బయటకెళ్లారు. ఆ సమయంలో ఆయన భార్య లహరి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. నిమిషాల వ్యవధిలోనే ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ‘మేడమ్.. సార్ ఏసీ రిపేరీ ఉందని చెప్పాడు.
ఎక్కడుందో చూపించండి’ అంటూ లోనికి దూసుకొచ్చేశాడు. వెంటనే గృహిణి జుట్టు పట్టుకుని, ఆమె మెడపై పిడిబాకును పెట్టి అరిస్తే చంపుతానని బెదిరించాడు. దీంతో ఆమె బెంబేలెత్తిపోయింది. అనంతరం ఆమెతోనే బీరువా తెరిపించి 30 తులాల బంగారు ఆభరణాలను, లక్ష రూపాయల నగదును తీసుకున్నాడు. ఈ క్రమంలో జుట్టును విడిపించుకునేందుకు లహరి ప్రయత్నించగా ఆ వ్యక్తి పిడిబాకుతో తలపై మోదాడు. దీంతో ఆమెకు కళ్లు తిరిగినట్టయ్యి.. నోట మాటరాలేదు. పని ముగించుకుని ఆ వ్యక్తి బైక్‌పై బయల్దేరగా.. అదే సమయంలో రమణ కుమార్తెతో తిరిగి వచ్చాడు.
అయితే షాక్ నుంచి కోలుకోని లహరి వెంటనే విషయాన్ని చెప్పలేకపోయింది. జుట్టు చిందరవందరగా ఉండటంతో ఏమైందని రమణ ఆరా తీస్తుండగా ఆమె భయంతో కుప్పకూలిపోయింది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న లహరి జరిగిన విషయాన్ని వివరించింది. అనంతరం దంపతులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించారు. డీఎస్పీ నాగరాజతో పాటు సీసీఎస్ సీఐ ఏ.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఆత్మకూరు సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐలు శ్రీనివాసులు, ధరణీకిషోర్, జాకీర్‌హుస్సేన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు ఆరా తీశారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి ఆనవాళ్లు సేకరించారు. కేసును సవాల్‌గా తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమాత్రం అనుమానం కలిగినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
దోపిడీకి పాల్పడిన అగంతకుడు నీలిరంగు టీషర్ట్, జీన్ ప్యాంట్, నల్లరంగు టోపీ ధరించి, 22 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగి ఉంటాడని బాధితురాలు లహరి పోలీసులకు వివరించింది. కాగా ఈ చోరీపై పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాగా తెలిసిన వ్యక్తి ఆధ్వర్యంలోనే చోరీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంటి యజమాని బయటకు వెళ్లిన అనంతరం లహరి ఒంటరిగా ఉండే సమయాన్ని చూసుకుని దొంగ జొరబడడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాంపురంలోనూ పట్టపగలే చోరీ
కంబదూరు మండల పరిధిలోని రాంపురం గ్రామంలో చిన్నగోవిందప్ప ఇంటిలో ఆదివారం పట్టపగలే ఆగంతకులు చోరీ చేసి రూ.63 వేలు విలువైన సొత్తు చోరీ చేశారు. ఎస్‌ఐ నారాయణయాదవ్, బాధితుడు తెలిపిన మేరకు.. రోజువారీ పనుల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ఇంటికి తలుపులు వే సి కుటుంబ సభ్యులంతా వ్యవసాయ తోటలోకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి పైభాగంలో పెంకుల్ని తొలగించిన దొంగలు లోపలకు ప్రవేశించి బీరువా పగులగొట్టారు. అందులోని రూ. 5 వేల నగదు, 2 తులాల బంగారు చైను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుత్తిలో 9 ఇళ్లల్లో చోరీ
గుత్తి పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటాక దొంగలు తాళం వేసి ఉన్న 9 ఇళ్లల్లో చోరీ చేశారు. సీపీఐ కాలనీలో ఉపాధి హామీ పథకం ఏపీఓ మద్దిలేటి, బచ్చిరెడ్డి, సంజమ్మల ఇళ్ల తలుపులు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాల్లో ఉన్న చీరలు, కొన్ని విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. గాంధీనగర్‌లో జనార్ధన్, రంగస్వామితోపాటు మరో వ్యక్తి ఇళ్లలోనూ, కుమ్మర వీధిలో ఒక ఇల్లు ఉప్పర వీధిలో మరో రెండు ఇళ్లలోనూ చోరీకి విఫలయత్నం చేశారు. బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో చీరలు తదితర వస్తువులను ఎత్తుకెళ్లారు.
తాడిపత్రిలో తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడిపత్రిలోని విజయనగర్‌కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటి యజమాని శశికళ తన కుమార్తెను చూసేందుకు 20 రోజుల క్రిత ం హైదరాబాద్‌కు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ క్రమంలో శనివారం రాత్రి దొంగలు ఈ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలోని విలువైన ఆభరణాలు, నగదు ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి ఇంటి యజమానురాలికి ఫోన్‌లో సమాచారమందించారు. పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని పరివీలించారు. బాధితురాలు ఆదివారం సాయంత్రం తాడిపత్రికి చేరుకుని ఇంట్లో చోరీకి గురైన వస్తువులను పరిశీలించారు. బీరువాలో పెట్టిన రూ.90 వేల నగదు, 10 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పట్టపగలు దోపిడీ
Published Mon, Jan 20 2014 3:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement