సాక్షి ప్రతినిధి, విజయనగరం: గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బినామీ రుణాల డొంక కదులుతోంది. సెక్షన్ 51 ప్రకారం అధికారులు ఆఘమేఘాల మీద విచారణకు ఉపక్రమించారు. రికార్డుల్లో ఉన్న రుణ గ్రహీతలకు నోటీసు లు జారీ చేస్తున్నారు. విచారణాధికారిగా నియమితులైన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పి. చిన్నయ్య పేరుతో జారీ అయిన 70 నోటీసులు ఇప్పటికే పంపిణీ చేసేశారు. ఈ నెల 16న రావివలస సొసైటీలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నా రు.
మీపేరున ఫలానా మొత్తంలో రుణం తీసుకున్నట్టుగా ఉందని, సదరు రుణం తీసుకున్నదీ లేనిదీ చెప్పాలని ఆ నోటీసులో కోరారు. ఉదాహరణకు... రావివలసకు చెందిన దాసరి పార్వతీకి జారీ చేసిన సమన్లలో 2012సెప్టెంబర్ 24న రూ.74వేల రుణం తీసుకున్నట్టు ఉంది. ఆ మొత్తం తీసుకున్నారా లేదా అన్నది ఈనెల 16 న పీఏసీఎస్‌లో జరిగే విచారణలో తెలపాలని, హాజరు కానిపక్షంలో స్పల్ప కాలిక రుణం కింద తీసుకున్నట్టుగా పరిగణించాల్సి వస్తుందని సమనులో స్పష్టం చేశారు. ఇదే తరహాలో ఇప్పటికే 70మందికి పంపిణీ చేయగా, గ్రామంలో మరో 3,930మందికి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ విచారణలో వాస్తవమేంటో తేలనుంది. బినామీల భాగోతం బయటపడనుంది.
ఉలిక్కిపడ్డ రైతులు
నోటీసులు అందుకోగానే రైతులు ఉలిక్కి పడ్డారు. తాము తీసుకున్న రుణం పది,పదిహేను వేల రూపాయల్లోనే ఉంటుందని డబ్బైయేసి వేలు ఉండదని వారంతా లబోదిబోమంటున్నారు. గ్రామ పెద్దల్ని కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారు. ఒక్క సోమవారమే గ్రామ పెద్దలు రెండు పర్యాయాలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ సమన్లు విషయమై చర్చించారు. దీన్నెలా ఎదుర్కోవాలో అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు.
మంతనాల్లో నేతలు
ఇదిలా ఉండగా, రుణబాగోతాన్ని దీన్ని ఏలాగైనా చేధించాలని టీడీపీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, తమను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పన్నుతున్న పధకాన్ని ఎలా తిప్పికొట్టాలన్నదానిపై కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే నాడు చక్రం తిప్పిన కాంగ్రెస్ యువనేత ఒకరు ఆ గ్రామంలోకి వెళ్లి రహస్య చర్చలు జరిపారు. ఇదెక్కడికి దారి తీస్తుందో, బినామీల భాగోతం ఏ స్థాయిలో బయటపడుతుందో వేచి చూడాలి.
కదులుతున్న బినామీ రుణాల డొంక !
Published Tue, Dec 9 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement