-సాక్షి కథనంతో అధికారుల్లో చలనం
కర్నూలు(హాస్పిటల్): ఆరు నెలలుగా గైనిక్ విభాగంలో ఏడు మృతశిశువులను బకెట్లలో దాచి ఉంచడంపై తెగిన బంధం...వీడని లోకం శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 14వ తేదీన ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కథనానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి స్పందించి అధికారుల వ్యవహార తీరుపై తీవ్రస్థాయిలో మండిపడగా, జిల్లా ఎస్‌పీ ఆకే రవికృష్ణ స్వయంగా రంగంలోకి దిగి మృతశిశువులకు అంతిమ సంస్కారం జరిపించారు.
మృతశిశువుల ఖననానికి రూ.125 మాత్రమే చెల్లించే ఆసుపత్రి అధికారులు ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.500లకు పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి కమిటీ సభ్యులైన సూపరింటెండెంట్ డాక్టర్ జె. వీరాస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ చంద్రశేఖర్, ఇన్‌చార్జి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు బృందం మంగళవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
పెంచిన మొత్తం ఈ రోజు నుంచే అమలుల్లోకి వస్తుందని డాక్టర్ వీరాస్వామి తెలిపారు. ఎన్‌జీవోలు తాత్కాలికంగా సహాయం చేసినా, మధ్యలో ఇవ్వకపోతే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
మృతశిశువుల ఖననానికి రూ.500
Published Wed, May 18 2016 8:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement