కొండను తవ్వి ‘ఎలుక’ను పట్టి.. | GGH Staff Nurses concern at Hospital authorities | Sakshi
Sakshi News home page

కొండను తవ్వి ‘ఎలుక’ను పట్టి..

Published Wed, Feb 3 2016 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

కొండను తవ్వి ‘ఎలుక’ను పట్టి..

కొండను తవ్వి ‘ఎలుక’ను పట్టి..

ఎలుకలు కొరకడంతో శిశువు మృతి చెందిన ఘటనలో పెద్దల పేర్లు మాయం చేసి, కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు నెలలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన పోలీసులు ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ కిందిస్థాయి సిబ్బందినే బాధ్యులను చేశారనే విమర్శలు వస్తున్నాయి.
 
* శిశువు మృతి కేసులో పెద్దల పేర్లు మాయం
* చిరు ఉద్యోగులను బలిచేస్తున్నారని జీజీహెచ్ స్టాఫ్ నర్సుల ఆందోళన

 
సాక్షి, గుంటూరు : గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లోని శిశు శస్త్రచికిత్సా విభాగంలో గత ఏడాది ఆగస్టు 26న ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.  దీనిపై రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆర్‌ఎంఓ శ్రీనివాసులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇద్దరు స్టాఫ్‌నర్సులను సస్పెండ్ చేసి ఆ విభాగం వైద్యులు డాక్టర్ భాస్కరరావు , సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావులను బదిలీ చేసింది. అయితే డాక్టర్ భాస్కరరావు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు.

దీంతో ఆయన ఇక్కడే పని చేస్తున్నారు. పసికందు కేవలం ఆసుపత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లి చావలి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై  కఠిన చర్యలు తీసుకుం టామని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అప్పట్లో ప్రకటించారు. ఇదిలావుండగా,  తాజాగా సోమవారం రాత్రి జీజీహెచ్‌కు చెందిన ఏడుగురు నిందితులు కోర్టు ముందు హాజరై బెయిల్ పొందారు. ఈ కేసులో సూపరింటెండెంట్ పేరు, శిశువు మృతిచెందిన వైద్య విభాగం వైద్యుడి పేరు ఎక్కడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు ఆసుపత్రిలోకి రావడానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య కాంట్రాక్టరేనని అప్పట్లో ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి కొత్తవారిని నియమించిన విషయం తెలిసిందే.

ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన ఆర్‌ఎంఓ , నర్సింగ్ సూపరింటెండెంట్‌లు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండాల్సి ఉండగా, వీరి పేర్లను ఏ-5, ఏ-7లుగా చూపారని నర్సింగ్ సంఘం నాయకులు పేర్కొంటున్నారు.  ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఏమీ లేనప్పటికీ తమపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా కేసులో ప్రధాన నిందితులుగా నమోదుచేయడం దారుణమని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సంఘటన జరిగిన సమయంలో పసికందు తల్లి చావలి లక్ష్మి సైతం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ బిడ్డను ఎలుకలు కరిచిన విషయాన్ని వైద్యుడికి, సూపరింటెండెంట్‌కు తెలిపామని చెప్పిన విషయం విధితమే. పోలీసులు వీరిద్దరి పేర్లను కేసులో చేర్చకపోవడంపై ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement