వైద్యం.. ప్రైవేట్‌ రాజ్యం..!  | Management Of Hospitals Without Permits | Sakshi
Sakshi News home page

వైద్యం.. ప్రైవేట్‌ రాజ్యం..! 

Published Sun, Jul 28 2019 10:34 AM | Last Updated on Sun, Jul 28 2019 10:34 AM

Management Of Hospitals Without Permits - Sakshi

వైద్యంలో ప్రైవేట్‌ ఇష్టారాజ్యంగా మారింది. అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు నిర్వహిస్తున్నారు. వీరి వల్ల ప్రాణాలకు ముప్పు తలెత్తితే ఎవరిది బాధ్యత అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక్కో లేబొరేటరీ, స్కానింగ్‌ సెంటర్లు ఇస్తున్న రిపోర్టులకు పొంతన ఉండడం లేదు. వీటి ఆధారంగా ప్రైవేట్‌ వైద్యశాలల్లో వైద్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం వికటించి ప్రాణాపాయం తలెత్తిన పరిస్థితులు లేకపోలేదు. రిజిస్ట్రేషన్‌ కలిగిన వైద్యసేవల సంస్థలు సైతం రెన్యువల్‌ చేయించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆయా వైద్య సేవా సంస్థలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన వైద్యఆరోగ్య శాఖాధికారులు కాసులకు కక్కుర్తి పడి పట్టించుకోవడం మానేస్తున్నారు. 

సాక్షి, నెల్లూరు:  జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, లేబొరేటరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రిజిస్ట్రేషన్లు చేయించకుండానే నడుపుతూ నిర్వాహకులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న పలు సంస్థలు గడువు ముగిసినా రెన్యువల్‌ చేసుకోకుండానే కొనసాగిస్తున్నారు. వీటిపై పర్యవేక్షణ కొరవడడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రి, లేబొరేటరీ, క్లినిక్, పాలీక్లినిక్‌ డెంటల్‌ ఆస్పత్రి, ఫిజియోథెరపీ యూనిట్లు విధిగా వైద్య, ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తొలుత రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సంస్థలు ఐదేళ్ల తర్వాత వాటిని పునరుద్ధరించుకోవాలన్న నిబంధనలు ఉన్నా అనేక చోట్ల అవి అమలు కావడం లేదు. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వివిధ కారణాలతో మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

అనుమతులు కొన్నింటికే..
వైద్యారోగ్యశాఖ వద్ద ఉన్న గణాంకాల మేరకు జిల్లాలో క్లినిక్‌లు 112, పడకల ఆస్పత్రులు 124, మేజర్‌ ఆస్పత్రులు 51, ల్యాబ్‌లు 48, స్కానింగ్‌ సెంటర్లు 176 వరకు అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది.  అనుమతులు లేకుండా దాదాపు 150 వరకు క్లినిక్‌లు, ఆస్పత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాబ్‌లు 50 వరకు అనుమతులు లేకుండా నిర్వహణ చేస్తున్నట్లు సమాచారం. ఇక గడువు ముగిసిన ఆస్పత్రుల పునద్ధరణ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ప్రతి సంస్థ ఈ ఏడాది జనవరి 1వ తేదీ లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, గడువు ముగిసిన సంస్థలు రెన్యువల్‌ చేసుకోవాలని ఉత్తర్వులు ఉన్నా అమలుకు నోచుకోలేదు. కొన్ని లేబొరేటరీలు డెంగీ, మలేరియా, ఇతర పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో దోచుకుంటున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇవన్నీ తప్పని సరి 
ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు లేబొరేటరీలు, డెంటల్‌ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఫిజియోథెరిపీ యూనిట్ల ఏర్పాటు చేయాలంటే వివిధ విభాగాల నుంచి అనుమతులు తప్పని సరి. వీటిని ఏర్పాటు చేసే భవనాలకు మున్సిపల్‌/పంచాయతీ అనుమతులు, అగ్నిమాపక శాఖ, ఐఎంఏ సభ్యత్వం, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, వైద్య పరీక్షల సామగ్రి  వివరాలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి, స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఫార్మసీ సిబ్బంది, ఆడిట్‌ నివేదిక, ఇలా అన్ని రకాల అనుమతులతో రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

కమిటీల జాడేది?
ఏపీపీఎంసీ ఈ చట్టం అమలుకు జిల్లాలోని కమిటీలను డివిజన్‌ల వారీగా ఏర్పాటు చేసి ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు, డెంటల్‌ ఆస్పత్రులు, ఫిజియోథెరిపీ సెంటర్లు,  డయాగ్నస్టిక్‌ సెంటర్లు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, వైద్యులు, న్యాయవాదులు, ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేసి తరచూ తనిఖీలు చేస్తే అక్రమాలకు తావుండదు. ఆ ది«శగా అధికారులు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి 
ప్రైవేట్‌ ఆస్పత్రులు, లేబొరేటరీలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, క్లినిక్‌లు డెంటల్‌ ఆస్పత్రులు, పిజియోథెరిపీ యూనిట్లు రిజిస్ట్రేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత మొత్తాన్ని రుసుంగా నిర్ణయించింది. క్లినిక్‌ రూ.1,250, పాలీక్లినిక్‌కు రూ.2,500, 20 పడకల ఆస్పత్రి రూ.3,750, 21 నుంచి 50 పడకల ఆస్పత్రి రూ.7,500, 101 నుంచి 200 పడకలు దాటిని ఆస్పత్రికి రూ.37,500, లేబొరేటరీకి రూ.2,500, డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు రూ.10,000, ఫిజియోథెరిఫీ యూనిట్‌కు రూ. 3,750 చొప్పున రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలి. కానీ ఏపీపీఎంసీ ఈ చట్టం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని నిర్వహించడంతో నిర్వాహకులు అనుమతులు తీసుకోవడం లేదని తెలుస్తోంది.

చర్యలు తీసుకుంటాం
ప్రైవేట్‌ ఆస్పత్రులు వైద్య సంస్థలు ఏపీపీఎంసీఈ చట్టం ప్రకారం విధిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకుని గడువు ముగిసినా సంస్థలు రెన్యువల్‌ చేసుకోవాలి. వీటిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. త్వరలోనే తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
– రాజ్యలక్ష్మీ, డీఎంహెచ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement