
మల్లికార్జున ఇంటిముందే శవాన్ని పూడ్చిన దృశ్యం
తనకల్లు (అనంతపురం): ఓ యువకుడిని హత్య చేసిన వారిలో పశ్చాత్తాపం కలిగేలా మృతుడి బంధువులు స్పందించారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుని ఇంటి ముందే మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం మోటిచింతమానుతండాలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు... ఈ నెల 3న తండాకు చెందిన వేణుగోపాల్ నాయక్‌ను కొందరు వ్యక్తులు హత్య చేసి సీజీ ప్రాజెక్టులో పడేశారు. హత్య విషయం వెలుగులోకి వచ్చిన మరుసటి రోజు అదే తండాకు చెందిన రవీంద్రనాయక్, మల్లికార్జున నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారు హత్య చేసినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. దీంతో వేణుగోపాల్‌నాయక్ బంధువులు కోపంతో రగిలిపోయారు. శవాన్ని పోస్టుమార్టమ్ చేసి ఆదివారం తండాకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని నిందితుడు మల్లికార్జున నాయక్ ఇంటి ఎదురుగా సమాధి చేశారు. హత్య చేసిన వారికి నిత్యం ఆ పాపం గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం కలగాలని ఈ విధంగా చేసినట్లు తండా వాసులు చెబుతున్నారు.