అమలాపురం : సరిగ్గా ఒక్క రోజు క్రితం ఆ గ్రామం కళకళలాడింది. పచ్చని కొబ్బరి తోపులు... వాటి మధ్య వంపులు తిరుగుతూ పారే కాలువ... ఒకవైపు కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో కీలకంగా ఉండే తాటిపాక మినీ రిఫైనరీ, ఓఎన్జీసీఎస్. మరోవైపు మార్కెట్ యార్డు గోడౌన్లు, అందమైన భవనాలు, హోటళ్లు, 216 జాతీయ రహదారి. చమురు సంస్థల్లోకి వెళ్లొచ్చే ఉద్యోగులు, ప్రయాణికులతో కిటకిటలాడే రహదారి. ఇలా ఎప్పుడూ సందడిగా ఉండే మామిడికుదురు మండలం నగరంలోని వానవాశివారి మెరక మరుభూమిగా మారిపోయింది.
గెయిల్కు చెందిన పైపులైన్ దుర్ఘటనతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. మంటల్లో కాలిపోయిన శవాలు, ఒళ్లంతా తగులబడి సహాయం కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు..బుగ్గవుతున్న ఇళ్లు, మాడిమసైపోయిన పచ్చని కొబ్బరి చెట్లు, తప్పించుకునేందుకు వీలు లేక అగ్నికీలల బారిన పడి చనిపోయిన పశువులు, పక్షులు. ఇలా హృదయ విదారక ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.
కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు ఉదయం వేళే నిద్ర లేచి తమ తమ దుకాణాలు తెరిచి పొట్టపోసుకునే సమయం... ఇంకొంత మంది ఇంకా నిద్రమత్తులోనే జోగుతున్న వేళ.. భవిష్యత్తు గురించి తియ్యటి కలలు కంటున్న తరుణం... ఆ ఆశలన్నీ సమాధైపోయాయి. వారి కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం ఓ శ్మశాన వాటికలా మారిపోయింది. 24 గంటల క్రితం పచ్చగా కళకళలాడిన నగరం గ్రామం ఒక్కరోజులోనే కన్నీటి సంద్రంలో కూరుకు పోయింది. గెయిల్ పైప్‌లైన్ పేలిన ఘటనలో 16 మంది మృత్యువాతపడిన నగరం గ్రామమంతా విషాదం నెలకొంది.
ఎటు చూసినా కలచివేసే దృశ్యాలే.....
Published Sat, Jun 28 2014 9:42 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM
Advertisement
Advertisement