సర్కారు రుణానికి ‘విభజన’ దెబ్బ!
Published Sun, Aug 4 2013 4:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రుణ సమీకరణపై విభజన ప్రభావం కొంత మేర పడింది. గతంలో సెక్యూరిటీ బాండ్లను విక్రయించి సేకరించిన రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వడ్డీ చెల్లించేది. కానీ రాష్ట్ర విభజన ప్రకటన మరుసటి రోజు సేకరించిన రుణంపై ఎక్కువ శాతం వడ్డీ పడింది. సెక్యూరిటీ బాండ్లను జాతీయ బ్యాంకులు కొనుగోలు చేసి ఆ మేరకు రుణాలు ఇస్తుంటాయి. ఆ రుణాలపై ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా సేకరించిన రుణంపై 7.57 శాతం నుంచి 8.22 శాతం మధ్య వడ్డీ చెల్లించేది. మిగతా రాష్ర్ట ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ కన్నా మనరాష్ట్ర ప్రభుత్వమే తక్కువ వడ్డీ చెల్లించే ది.
అయితే గతనెల 31న రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణంపై... మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనమే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సుస్థిరత ఆధారంగా వడ్డీ శాతం హెచ్చు తగ్గులుంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు రాజకీయ అస్థిరత నెలకొన్న సందర్భాల్లో ప్రభుత్వం చేసే రుణాలపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాజకీయ స్థిరత్వం ఉంటే తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రంలోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, అటు రాజకీయంగాను ఇటు ఆర్థికపరంగాను వ్యత్యాసాలు వస్తాయనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే సెక్యూరిటీ బాండ్లను జాతీయ బ్యాంకులు అధిక వడ్డీకిగానీ కొనుగోలు చేయడం లేదని ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు.
ఎంత తేడా..!
గతనెల 31న రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణం సేకరణకు సెక్యూరిటీ బాండ్లను విక్రయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 9.48 శాతం వడ్డీకిగానీ వాటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులు ముందుకురాలేదు. చివరికి ఆ వెయ్యి కోట్ల రూపాయల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం 9.46 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అదేరోజు హర్యానా ప్రభుత్వం రూ.500 కోట్ల రుణానికి సెక్యూరిటీ బాండ్లను విక్రయించగా 9.05 శాతం వడ్డీ పడింది. అలాగే పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు రూ.500 కోట్ల చొప్పున రుణ సేకరణకు బాండ్లను విక్రయించగా 9.05 శాతం వడ్డీ పడింది.
తమిళనాడు ప్రభుత్వం రూ.400 కోట్ల రుణం సేకరించగా 9.10 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అంటే అన్ని రాష్ట్రాల కంటే మనరాష్ట్రమే అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చిందన్నమాట! మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో రూ.1000 కోట్ల రుణానికి సెక్యూరిటీ బాండ్లను విక్రయించగా కేవలం 8.22 శాతం వడ్డీయే పడింది. అలాగే మే నెలలో మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని సేకరించిన సమయంలో 7.57 శాతం వడ్డీయే చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 9.46 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర విభజన ప్రభావమేనని, ఇక ముందు కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement