తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటిపాకల గ్రామానికి చెందిన కడియాల బుల్లబ్బాయి(29) అనే కౌలు రైతు అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. నాలుగేళ్లుగా వరి సాగు చేస్తున్న బుల్లబ్బాయి ప్రకృతి వైపరీత్యాలు, పంట తెగుళ్లతో వరుసగా నష్టాలు రావడంతో రూ.2.5 లక్షల వరకు అప్పుల పాలయ్యారు. కొద్ది నెలల క్రితం భార్య నగలు, కుమార్తె గొలుసు తాకట్టు పెట్టి కొంత అప్పు చెల్లించారు. అయినా రూ.2 లక్షలకు పైగా రుణం మిగిలి ఉంది. రైతుమిత్ర గ్రూపు ద్వారా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.15 వేల రుణం మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. చెల్లించాల్సిందేనని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో విధిలేక అప్పుతెచ్చి చెల్లించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పొలంలోని పాకలో ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య, కూతురు(4), ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. మండపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.