రాజధాని గ్రామాల్లో భూసేకరణపై త్వరలో నిర్ణయం
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూసేకరణ ఉంటుందా? ఉండదా? అనే అంశాన్ని 15 రోజుల్లో తేలుస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఇప్పటివరకూ సమీకరించిన 33 వేల ఎకరాలతో పాటు మరో 1,000 ఎకరాలు అవసరమని తెలిపారు. అయితే దీనికి భూసేకరణ ఉండబోదని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆదివారం మంత్రి ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. రైతులతో ఒప్పందం చేసుకునే విషయంలో అఫిడవిట్లలో గందరగోళం లేకుండా ఏకపత్రం (సింగిల్ పేపరు) విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
త్వరలో వ్యవసాయ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో త్వరలో వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయనున్ననట్లు మంత్రి ప్రకటించారు. ఇవి వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో ఉన్నాయన్నారు. వాటిని వచ్చే మార్చిలోగా భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయపరంగా ఐదు లక్షల ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరును మంత్రి ప్రారంభించారు. 1800-425-2960 నెంబరుకు ఫోన్ చేసి రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవ చ్చన్నారు.
ఉద్యానవన రైతులకు ‘మాఫీ’
రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన ఉద్యానవన పంటల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ శాఖ అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదానికి పంపింది. ఇది రుణ మాఫీ పథకం కిందకు రాదంటూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. మున్సిపల్ శాఖ నిధులనుంచే మాఫీ చేసుకోవాలని సూచించింది. రాజధానిలో భూములు కోల్పోయిన రైతులకు 5,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వారికి మాఫీ వర్తించనుంది.
25 లోగా అమలు: నారాయణ
తాడికొండ: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల రైతులందరికీ ఈనెల 25వ తేదీలోగా ఒకేసారి రూ.1.5 లక్షల రుణమాఫీ చేస్తామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. సోమవారం తుళ్లూరులో బ్యాంకు అధికారులతో ఆయన మాట్లాడారు. 3,450 ఎకరాలకు గాను 2,616 మంది రైతులకు రూ.9.35కోట్లకు కౌలు డీడీలను ఇచ్చామన్నారు.
‘సీఆర్‌డీఏ’పై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, ఏపీ విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి గత వారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వ్యాజ్యంపై వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి కోరడంతో, ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.