ఆడపిల్లకు ఎన్ని శోకాలో
ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లేనంటారు.. కానీ నేడు ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే పిండదశలోనే తుంచేస్తున్న దుస్థితి నెలకొంది. మరికొందరు ఆడపిల్ల పుట్టిందంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నెలల వయస్సులోనే మృత్యువాత పడుతుండగా, మరికొందరు కన్నపేగు బంధాన్ని తెంచుకుంటూ చెత్తకుప్పలపాలు చేస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న భ్రూణహత్యలపై కథనం..
- గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు
- గూడూరులో వెలుగుచూసిన తాజా ఉదంతం
- వైద్యాధికారుల విచారణ
చిట్టితల్లుల్ని చిదిమేస్తున్నారు. పసిమొగ్గల్ని పిండదశలోనే పిండేస్తున్నారు. పురిటి నొప్పులు భరించి.. చావుకు దగ్గరగా వెళ్లి తనకు జన్మనిచ్చే అమ్మ.. జీవితాంతం కలిసి ఉండే భార్య కూడా ఆడవారేనని మరిచిపోతున్న మగాడు తన కూతురు విషయం వచ్చేసరికి అన్నీ మరిచి మృగాడవుతున్నాడు. తాజాగా మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఉదంతం జిల్లాలో భ్రూణ హత్యలపై భయాందోళనను రెట్టింపు చేస్తోంది.
లబ్బీపేట : జిల్లాలో బాలబాలికల నిష్పత్తి తగ్గిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల వయస్సులోపు పిల్లల్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా జిల్లాలో ప్రతి వెయ్యిమంది బాలురకు 934 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ పరిస్థితి మారకపోతే రానున్న కాలంలో బాల, బాలికల మధ్య నిష్పత్తి మరింత ప్రమాదకరస్థాయికి దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకుంటున్నా, అధిక ఫీజులకు ఆశపడి అత్యాసతో కొందరు వైద్యులు పరీక్షలు చేస్తూనే వున్నారు. అందుకు మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది.
అసలేం జరిగిందంటే...
గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన పేరం నాగబాబుకు పమిడిముక్కల మండలం సోరగుడికి చెందిన దుర్గాదేవితో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఐదేళ్లు, రెండేళ్లు వయస్సుగల ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. మళ్లీ గర్భం దాల్చడంతో ఓ ఆర్‌ఎంపీ వైద్యుని సూచనతో మచిలీపట్నంలోని ప్రసూతి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యురాలు పరీక్షలు చేసి స్కానింగ్ రాయడంతో, దుర్గాదేవి భర్త నాగబాబు, అత్త నీలావతి లింగనిర్ధారణ పరీక్షకు పూనుకున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. చివరికి అబార్షన్ వికటించడంతో తల్లి ప్రాణాపాయస్థితికి చేరుకుంది.
నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..
గర్భస్రావం భార్యాభర్తల ఇష్టపూర్వకంగానే చేయాల్సి వుంది. గర్భం దాల్చిన 12 వారాల లోపు గర్భస్రావం చేయడం సురక్షితమని నిపుణులు చెపుతున్నారు. అ తర్వాత 12 నుంచి 18 వారాలమధ్య నిపుణులైన వైద్యులు గర్భస్రావం చేయాల్సి వుంది. అనంతరం గర్భస్రావం చేయడం తప్పనిసరైతే ఇద్దరు గైనకాలజిస్టుల పర్యవేక్షణలోనే చేయాలి. కానీ ఆరోనెల గర్భం సమయంలో దుర్గాదేవికి నిర్లక్ష్యంగా గర్భస్రావం చేయడం వల్లనే ప్రాణాపాయస్థితికి చేరుకున్నట్లు చెపుతున్నారు.
నాపై ఒత్తిడి తెచ్చారు..దుర్గాదేవి
గర్భస్రావం చేయించుకోవాలంటూ తనపై భర్త నాగబాబు, అత్త నీలావతి ఒత్తిడి చేసినట్లు వైద్య సిబ్బందికి దుర్గాదేవి చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా రూ.10 వేలు ఇచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు ఆమె సోదరుడు శివనాగరాజు చెపుతున్నారు. గర్భస్రావమైన తర్వాత కూడా పూర్తిస్థాయి చికిత్స చేయించకుండా ఇంటికి తీసుకెళ్లడం వలనే ఇన్‌ఫెక్షన్ సోకి, పరిస్థితి విషమించినట్లు వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ త్రిపురసుందరీదేవి ‘సాక్షి’కి తెలిపారు.
గుట్టు చప్పుడు కాకుండా లింగనిర్ధారణ..
జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు దుర్గాదేవి ఘటన బట్టి తెలుస్తోంది. ఏడాదిన్నర కిందట గుంటూరుకు చెందిన మహిళకు నగరంలో లింగనిర్ధారణ పరీక్ష లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దుర్గాదేవి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెలుగు చూసింది.
వైద్య ఆరోగ్యశాఖాధికారుల విచారణ..
దుర్గాదేవి ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఆర్ నాగమల్లేశ్వరి విచారణ చేపట్టినట్లు ‘సాక్షి’కి తెలిపారు. గర్భస్రావం చేసిన ఆస్పత్రికి వెళ్లి విచారణ జరపడంతో పాటు, ఆమెను ఆస్పత్రికి ఎవరు తీసుకు వచ్చారు.. ఎప్పుడు గర్భస్రావం చేసారనే విషయాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. స్కానింగ్ ఎక్కడచేయించారనే విషయం తెలియాల్సి ఉందన్నారు.