క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ | Dedicated to the development of sports policy | Sakshi
Sakshi News home page

క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ

Published Thu, Jan 8 2015 1:37 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ - Sakshi

క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ

బాల్‌బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు
 
విజయవాడ స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌లో సత్తాచాటగల క్రీడాకారులను రాష్ట్రం నుంచి తయారు చేసేలా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బుధవారం చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్న స్టేడియాలు నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్ర క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేని కారణంగా రాణించలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తంచేశారు. కొరియా, జపాన్ వంటి చిన్నచిన్న దేశాలు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్నాయని వివరించారు.

బాల్‌బ్యాడ్మింటన్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకొచ్చిన ఫెడరేషన్ అధ్యక్షుడు సిహెచ్.రాజశేఖర్‌ను సీఎం అభినందించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌తో పాటు పలు జాతీయస్థాయి పోటీల నిర్వహించామని, హైదరాబాద్ గచ్చిబౌలీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేడియం నిర్మించామని గుర్తుచేశారు. 2018లో జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బాల్‌బ్యాడ్మింటన్ తమిళనాడులోని తంజావూరుకు చెందిన ప్రాచీన ఆటని పేర్కొన్నారు. ఇది ఎక్కువగా కావేరి, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖోతో పాటు బాల్‌బ్యాడ్మింటన్ అంతర్జాతీయస్థాయికి ఎదిగిందన్నారు. చిన్నతనంలో బాల్‌బ్యాడ్మింటన్ ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తామన్నారు. ప్రారంభోత్సవానికి విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రావు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, కాగిత వెంకట్రావ్, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జె.మురళీ, డీఎస్‌డీవో పి.రామకృష్ణ, బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యకక్షుడు సిహెచ్.రాజ       శేఖర్, ఏపీ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి చుక్కపల్లి అమర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి సింగరాజు మురళీకృష్ణ,జిల్లా ఒలింపిక్స్ సంఘ కార్యదర్శి కె.పి.రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. వీఎం రంగా మునిసిపల్ స్కూల్, బీఎస్‌ఆర్‌కే మునిసిపల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలంరించాయి. అనంతరం జరిగిన పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు.
 
బాల్ బ్యాడ్మింటన్ తొలి రోజు ఫలితాలు


 పురుషుల విభాగంలో ముంబాయి జట్టు 29-9, 29-7 తేడాతో మణీపూర్‌పై, పశ్చిమబెంగాల్ జట్టు 29-2, 29-3 తేడాతో ఎన్‌సీఆర్ పై, మహారాష్ట్ర జట్టు 29-13, 29-10 తేడాతో జార్ఖండ్‌పై, పాండిచ్చేరి 29-9, 29-10 తేడాతో పంజాబ్‌జట్టుపై, ఇస్రో జట్టు 29-19, 29-18 తేడాతో బీహార్ జట్టపై, మేజర్ పోర్టు జట్టు  29-21, 29-18 తేడాతో ఒడిసా జట్టుపై గెలుపొందాయి.
 మహిళల విభాగంలో : కేరళ జట్టు 29-2, 29-2 తేడాతో మణిపూర్ జట్టుపై, జార్ఖండ్ జట్టు 29-13, 29-7 తేడాతో హర్యానాపై, బీహార్  29-9, 29-5 తేడాతో పశ్చిమబెంగాల్ పై విజయం సాధించాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement