'హోదా దీక్ష' తేదీల్లో మార్పు: జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15వ తేదీ నుంచి చేయతలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. వినాయకచవితి పండుగ ఉన్నందువల్ల 15వ తేదీన కాకుండా మరో రోజు నుంచి దీక్ష ప్రారంభించాలని పార్టీ నేతలు సూచిస్తున్నట్లు ఆయన చెప్పారు. బహుశా 19 లేదా 20వ తేదీ నుంచి దీక్ష ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. తాను దీక్ష చేయడం వల్ల ప్రజలకు మేలే జరుగుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ప్రభుత్వానికి కూడా ప్రత్యేక సాధనలో తన దీక్ష ఉపయోగపడుతుందన్నారు.
ఇష్టం లేకుంటే భూములు ఇవ్వొద్దు: జగన్ భరోసా
ఇష్టం లేకుంటే భూములివ్వొద్దని, బలవంతంగా సేకరించాలని చూస్తే ప్రతిఘటించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులను ఉద్దేశించి అన్నారు. కర్నూలు జిల్లాలోని తంగెడంచ, భాస్కరాపురం, బన్నూరు గ్రామాల్లో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ఎమ్మెల్యే వై.ఐజయ్య నేతృత్వంలో గురువారం అసెంబ్లీ లాబీల్లో వైఎస్ జగన్‌ను కలుసుకుని మొరపెట్టుకున్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, అవసరమైతే తాను కూడా ఆ గ్రామాలను సందర్శించి అండగా ఉంటానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.