
ఓటమి భయం + ఉక్రోషం =దౌర్జన్యం
- జిల్లాలో వైఎస్సార్‌సీపీపై కొనసాగుతున్న టీడీపీ దాష్టీకం
- తాజాగా పెంజెండ్రలో ఎన్నికల ర్యాలీపై దాడి
- మద్యం సేవించి బైక్‌లతో మహిళలపైకి దూసుకొచ్చిన వైనం
- ఎంపీటీసీ అభ్యర్థిని చేతికిగాయం
వెంటాడుతున్న ఓటమి భయం.. ప్రత్యర్థి మనకంటే బలవంతుడనే ఉక్రోషం.. వెరసి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు భౌతిక దాడులకు దిగేస్థాయికి దిగజార్చాయి. మున్సిపల్, పరిషత్ తొలి దశ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు దిగిన టీడీపీ శ్రేణులు పరిషత్ రెండో దశ ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారం గుడ్లవల్లేరులో వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి ఎన్నికల ప్రచార ర్యాలీపై దాడి చేయడం కలకలం రేపింది.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓటమి ఉక్రోషంతో కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు బాహాటంగా దాడులకు దిగి దాష్టీకానికి పాల్పడుతున్నారు. పరిషత్ ఎన్నికల రోజైన ఈ నెల ఆరో తేదీన జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో సామినేని ఉదయభాను అల్లుడు విజయనర్సింహారెడ్ది కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే.
మక్కపేటలో పోలింగ్ సరళి చూసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానుపై టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మీరెందుకు ఇక్కడకు వచ్చారంటూ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు ఓటింగ్ సరళిని చూసుకునేందుకు వచ్చినా టీడీపీ శ్రేణులు సహించలేకపోవడం శోచనీయం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో రెడ్డినాయక్‌తండా, ధర్మవరపు తండా ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలింగ్ సమయంలో టీడీపీ కార్యకర్తలు వివాదానికి దిగారు.
దాడిచేసి.. గాయపరిచి...
నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం మోగులూరులో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బండి జానకిరామయ్యపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన తలకు గాయమైన సంగతి తెల్సిందే. అదే ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి. బండి జానకిరామయ్య ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈ నెల ఐదో తేదీ రాత్రి గనిఆత్కూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పాటిబండ్ల హరిజగన్నాథరావుపై టీడీపీ స్థానిక నేతలు దాడికి దిగారు. ఈ నెల ఆరున మచిలీపట్నం మండలంలోని పల్లెతాళ్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిచేయగా వైఎస్సార్‌సీపీ నాయకుడు చెక్కా కృష్ణారావుకు గాయాలయ్యాయి.
కంచికచర్ల మండలం పరిటాలలో వైఎస్సార్‌సీపీ నేత బత్తుల తిరుపతిరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విజయవాడ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్లలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసిన సంగతి కూడా తెల్సిందే. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలే ఓటమి భయం.. ఆపై మద్యం సేవించారు.. ఇంకేముంది రెచ్చిపోయిన టీడీపీ యువకులు బైక్‌లతో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీలోకి దూసుకుని వచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని చేతికి గాయమైంది. బుధవారం జరిగిన ఈ ఘటన టీడీపీ శ్రేణుల తీరుకు తాజా నిదర్శనం. గుడ్లవల్లేరు మండలం పెంజెండ్రలో వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి, జెడ్పీటీసీ అభ్యర్థిని అల్లూరి శిరీష, ఎంపీటీసీ అభ్యర్థిని బలుసు శ్రీసంధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం ఆఖరిరోజు కావడంతో ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు కొందరు మద్యం సేవించి విచక్షణారహితంగా బైక్‌లతో వైఎస్సార్‌సీపీ ర్యాలీలోకి దూసుకొచ్చారు. ఈ ఘటనలో ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీసంధ్య చేతికి గాయమైంది. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. అప్పటికీ వారు అదే తీరుతో మహిళలని కూడా చూడకుండా దుర్భాషలకు దిగారు. దీంతో చైర్‌పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి జోక్యం చేసుకుని ఇది సరైన పద్ధతి కాదని, ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని మండిపడ్డారు.
స్థానికుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి పెరిగిన ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ ఇలా భౌతిక దాడులకు దిగుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపతున్నారు. గత కొద్దిరోజులుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను గమనిస్తే అవి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారనే సంగతి తేటతెల్లమవుతోంది.
స్లిప్‌ల పంపిణీలోనూ రాజకీయమే...
ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో సిబ్బంది పంచాల్సిన ఓటరు స్లిప్‌లను టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పంపిణీ చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు టీడీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగానే ఓటరు స్లిప్‌లు పంచలేదన్న విషయాన్ని నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.