పోరాటాలతోనే ప్రభుత్వ సంస్థల రక్షణ
► మోదీ, బాబులకు ప్రైవేటుపైనే ప్రేమ
► రైల్వే, రక్షణ, ఓడరేవుల భూములను కారుచౌకగా కట్టబెట్టే పన్నాగం
► సీపీఎం నేత బీవీ రాఘవులు ధ్వజం
► ‘సేవ్ పబ్లిక్ సెక్టార్.. సేవ్ విశాఖ పేరుతో ’ భారీ ర్యాలీ, బహిరంగ సభ
ద్వారకానగర్ (విశాఖ దక్షిణం): ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహం చూపుతున్నాయని, ఇందులో భాగంగా విశాఖలో కూడా అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ధ్వజ మెత్తారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వకపోగా రైల్వేస్టేషన్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
‘సేవ్ పబ్లిక్ సెక్టార్.. సేవ్ విశాఖ పేరుతో ’ రైల్వేస్టేషన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించేందుకు పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న విశాఖ నేడు మహా నగరంగా మారడానికి స్టీల్‌ప్లాంట్, ఓడరేవు, (పోర్టు), భెల్, రైల్వే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలే కారణమని గుర్తుచేశారు.
అయితే ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడానికి, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ధారాదత్తం చేయాడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజాపోరాటాలతోనే వీటిని అడ్డుకోవాలని పిలుపిచ్చారు. విశాఖతో సహా దేశంలో 42 ప్రధాన రైల్వేస్టేషన్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పేరుతో చుట్టూ ఉండే భూములు, ఆస్తులను అమ్మేస్తున్నారని ఆరోపించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌పరం చేశారని, మరికొన్ని మూసివేశారని చెప్పారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కార్మికులు పనిచేయడం లేదనే దుష్ప్రచారాన్ని ప్రభుత్వ అనుకూల మీడియాతో చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టీల్‌ప్లాంట్లు, హెచ్‌పీసీఎల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలు ఎంతో ప్రగతి సాధించాయంటే కార్మికులు కృషి కారణం కాదా అని ప్రశ్నించారు. సత్యం జంక్షన్ వద్ద టెక్ మహేంద్ర ఐటీ సంస్థలు నెలకొల్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి డాక్టర్ గంగారావు మాట్లాడుతూ విశాఖ నగరంలో అభివృద్ధి పేరిట అధికంగా పన్నుల భారం మోపుతున్నారన్నారు.
విశాఖలో భెల్, హెచ్‌పీసీఎల్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) ఎన్‌ఏడీ, నేవల్ డాక్‌యార్డు, డీఆర్‌డీవో, రైల్వే వంటి సంస్థల్లో లక్షా 10 వేల మంది వరకు పర్మినెంట్ ఉద్యోగులు, వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు, ఇంకో 60 వేల మంది పదవీవిరమణ చేసిన వారు ఉన్నారని, వీటిపై ఆధారపడి లక్షాలాది మంది జనం జీవిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విధానాలతో ఇలాంటి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం బహిరంగ సభ వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించారు. సీపీఎం నగర నాయకులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఎం.జగ్గునాయుడు, పి.జగన్, పి.ప్రభావతి. పి.కోటేశ్వరరావు, కె.ఎన్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.