కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): డిగ్రీ వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధంగా జిల్లాలోని 106 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న 45,000 మంది విద్యార్థులు 61 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 6వ సెమిస్టర్‌కు 13,000, 2వ సెమిస్టర్‌కు 17,000,4వ సెమిస్టర్‌కు 15,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు పూటల పరీక్షలను నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 1800 మంది ఇన్విజిలేటర్లు, 61 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది కేంద్రాల పరిశీలకులు, మూడు స్క్వాడ్ బృందాలను నియమించినట్లు ఆర్‌యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం మూడో విడత జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు కేంద్రాలకు వచ్చేందుకు ఇబ్బంది ఉన్న చోట బస్సులు ఏర్పాటు చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు సూచించామన్నారు. ఈ ఏడాది కొత్తగా కోసిగి ఏపీ మోడల్ స్కూల్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
జంబ్లింగ్‌లో పారదర్శకత ఉండేనా
జంబ్లింగ్‌లో పరీక్షల నిర్వహణ మంచిదే. అయితే పరీక్షలు రాసే విద్యార్థులను జంబ్లింగ్ చేయకుండా కళాశాలలను మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. కళాశాలల యాజమాన్యాలు అనుకూలంగా ఉన్న చోట కాపీయింగ్ జరిగే అవకాశం ఉంది. అదే పోటీ తత్వం ఉంటే విద్యార్థులు ఇబ్బందులు పడే వీలుంది. కొన్ని మండలాల్లో ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఉండటంతో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. దీన్ని ఆర్‌యూ అధికారులు నివారించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment