సాక్షి, నల్లగొండ
అసలే పేదరికం... రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు. ఉన్న చిన్నపాటి ఇళ్లు కూడా నేలమట్టం కావడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆరుబయటే జీవనం సాగిస్తున్నాయి. గత ఆగస్టు నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో పలువురు రోడ్డున పడగా.. మరికొందరు కూలిన ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. వీరికి నష్టపరిహారం చెల్లించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. కొందరికి చెల్లించి.. మరికొందరికి మొండిచేయి చూపించారు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి కాసింతైనా ఆర్థిక సాయం అందజేస్తే అదే పదివేలు. ఈ నిజాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. చేయూత కోసం బాధితులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో గత ఆగస్టు నెల 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు చేరి పలు గ్రామాలు చెరువులను తలపించాయి. సూర్యాపేట, హుజూర్‌నగర్, నకిరేకల్, మిర్యాలగూడ తదితర నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఇళ్లు కూలిపోయాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,770 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. ఇందులో 365 పూర్తిగా ధ్వంసం కాగా, 327 ఇళ్లు అధికంగా దెబ్బతిన్నాయి. మరో 1,078 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. నష్టపరిహారంగా పక్కా ఇల్లు పూర్తిగా నేలమట్టమైతే *35 వేలు, కచ్చా ఇల్లయితే *15 వేలు, పూరిల్లుకు *1500, తీవ్రంగా దెబ్బతిన్న శాశ్వత ఇల్లుకు *6300, పక్కా ఇంటికి *3200 చొప్పున చెల్లించాలి. పాక్షికంగా నష్టం కలిగిన ఒక్కో ఇంటికి *1900 పరిహారంగా అందజేయాలి. అంతేగాక దుస్తులు, ఇతర సామగ్రి, వంట పాత్రలు వగైరా కోల్పోతే కుటుంబానికి *1500 చొప్పున అందించాలి. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ జీఓ 5 ప్రకారం చెల్లించాలని స్పష్టం చేసింది.
తీవ్ర జాప్యం....
బాధితులను గుర్తించి నష్టపరిహారం నగదు రూపంలో అందజేయాలని అధికార యంత్రాం గం నిర్ణయించింది. ఈ బాధ్యతను ఆర్డీఓలు, తహసీల్దార్లకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు పర్యటించి బాధితులను గుర్తించి పంచనామా చేయాలి. కూలిపోయిన/దెబ్బతిన్న ఇంటి ఫొటో తీసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. నిజ నిర్ధారణ చేసుకుని బాధితులకు నష్టపరిహారం అందజేయాలి. అయితే ఇప్పటివరకు కొంతమంది బాధితులకు మాత్రమే డబ్బులు అందజేశారు. ఇంకా కొంత మంది బాధితులు గుర్తింపునకు నోచుకోలేదు. ఫలితంగా నష్టపోయినవారి జాబితాలో వారి పేర్లు చేర్చకపోవడంతో పరిహా రం అందలేదు. మరికొందరికి జాబితాలో చోటు దక్కినా ఫలితం లేకపోయింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇళ్లకు మరమ్మతు చేయించుకోవడం లేదు. నష్టపరిహారం కోసం నిరీక్షిస్తున్నారు.
అద్దె ఇంట్లో మల్లయ్య
బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం మండలంలోని తేలువారిగూడెం గ్రామం నుంచి కట్టంగూర్‌కు వచ్చి సొంతిల్లు నిర్మించుకున్నాను. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు ఒక పక్క కూలిపోయింది, ఇంట్లోని సామగ్రి ధ్వంసమైంది. రూ. 75 వేలకుపైగా నష్టం వాటిల్లింది. దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబ సభ్యులతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. కూలిన ఇంటిని అధికారులు పరిశీలించారే తప్ప ఆర్థిక సాయం అందించలేదు. తక్షణమే అధికారులు స్పందించి ఆదుకోవాలి. డబ్బులు అందజేస్తే తనకు ఎంతో కొంత ఆసరా అవుతుందని భావిస్తున్నా.
- తరాల మల్లయ్య, కట్టంగూర్
కూలిన ఇంట్లోనే నివాసం..
శాలిగౌరారం : ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన రాజమ్మది నిరుపేద కుటుంబం. పూర్తిగా మానసిక వికలాంగుడైన ఆమె కుమారుడు మల్లయ్య.. తల్లి చెంతనే ఉంటున్నాడు. గ్రామస్తుల మీద ఆధారపడి వారందించే ఆహారం తిని కాలం వెళ్లదీస్తున్నారు. ఆమె పెంకుటిల్లు గత ఆగస్టు 16న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నేలకూలింది. అద్దె ఇంట్లో నివసించే స్థోమత లేక కూలిన ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్న కొద్ది పాటి కప్పు కూడా ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందుతున్నా అధికారులు పరిహారం అందించడంలేదు.
పరిహారం అందజేతలో జాప్యం
Published Wed, Oct 2 2013 2:39 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement