సాక్షి, రంగారెడ్డి జిల్లా: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు గాను వివిధ సహకార సంస్థలు (కార్పొరేషన్లు) ఇచ్చే రాయితీ రుణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.సర్కారు నుంచి స్పష్టత లేకపోవడం.. అధికార యంత్రాంగం అలసత్వంతో రుణాల తీరు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకే పరిమితమవుతోంది. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాలోని వివిధ సహకార సంస్థలు రాయితీ రుణాల కోసం 10,731 మందిని ఎంపిక చేశాయి. అయితే ఆర్థిక సంవత్సరం ప్రారంభమై తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు కేవలం 522 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం.
ఎంపిక సరే.. మంజూరేదీ!
రాయితీ రుణాలకు సంబంధించి మండలాలవారీగా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రుణాలపై మండలాల్లో హడావుడి చేసిన అధికారులు చివరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. రుణాల మంజూరు మాత్రం నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి రుణాల మంజూరు ప్రక్రియ ఈ పాటికే పూర్తికావాల్సి ఉంది. అయితే రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్‌లో రుణాల మంజూరు నిలిచిపోయింది. మిగిలిన కేటగిరీల్లో రాయితీపై స్పష్టత ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఉదాసీనతతో ఈ తంతు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది.
లబ్ధిదారుల్లో కలవరం..
కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రాయితీ రుణాలతో లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. యూనిట్ ఏర్పాటుకు రుణ మొత్తం పూర్తిస్థాయిలో సరిపోనప్పటికీ.. ఇతోధిక సాయం లభిస్తుంది. ఈ మేరకు ఎంపికైన లబ్ధిదారులు రుణం వస్తుందనే ఆశతో ఇప్పటికే పలుచోట్ల యూనిట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ రుణా ల ఊసు లేకపోవడంతో లబ్ధిదారుల్లో కలవరం మొదలైంది. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండడంతో రుణం వస్తుందా.. లేదా? అనే సందేహం నెలకొంది.
రాయితీపై స్పష్టత లేకే..
కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలపై లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రాయితీని ప్రభుత్వం నిర్దేశించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చే రాయితీని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. గతంలో ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.30వేలు రాయితీ ఇచ్చేది. అయితే ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాయితీపై సందిగ్ధం నెలకొంది. అతి త్వరలో రాయితీపై స్పష్టత వస్తుందని, ఆ వెంటనే రుణాలు మంజూరు చేస్తామని షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు పీవీఎస్ లక్ష్మి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
రుణ ఘోష!
Published Fri, Dec 20 2013 12:15 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement