అన్నవరం పాతబస్టాండ్‌లో ప్రసవం జరిగిన అనంతరం మహిళ నేలమీద కూర్చుండిపోయిన బాలింత
అన్నవరం (ప్రత్తిపాడు): సోమవారం ఉదయం పది గంటలు. 35 డిగ్రీలకు మించిన ఎండ. ఆ సమయంలో అన్నవరం పాతబస్టాండ్‌లో ఒక ఆటో ఆగింది. దానిలో నుంచి నిండుగర్భిణి, ఆమె తల్లి కిందకు దిగారు. అప్పటికే ఆ మహిళ తీవ్రంగా నొప్పులు పడుతోంది. కిందకు దిగిన మరుక్షణం ఆమె కిందకు వాలిపోయింది. ఆ వెంటనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ప్రసవం జరిగిపోయింది.
ఆ మహిళ వెంట వచ్చిన ఆమె తల్లి ఆ శిశువును తన పొత్తిళ్లలోకి తీసుకోగా ఆ మహిళ కొంతసేపు అలానే నేలమీద కూర్చుండి పోయింది. అక్కడ ఉన్న వారు కొంతమంది 108కు ఫోన్ చేయగా వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆమె చెప్పిన వివరాల మేరకు ప్రాథమిక చికిత్స చేసి తొండంగి పీహెచ్‌సీ కి తరలించారు.
వివరాలివీ..
108 సిబ్బంది కథనం ప్రకారం.. తొండంగి మండలం సీతారాం పురం గ్రామానికి చెందిన మహిళపేరు మారుకొండ పెద్దాపురం అని తెలిపారు. తొండంగి వైద్యాధికారి డాక్టర్ నాగభూషణం ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి రెగ్యులర్‌గా చెకప్ చేస్తున్నారని తెలిపారు. ఆమె కు ఈ నెల 29న డెలివరీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
అయితే కాకినాడలో కూడా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడంతో కాకినాడ ఆసుపత్రికి వెళ్లేందుకు తొండంగి నుంచి అన్నవరం రాగా, అక్కడే డెలివరీ అయినట్టు తెలిపారు. తల్లి పిల్లలను తొండంగి ఆసుపత్రిలో చూపించిననంతరం వైద్యాధికారి సూచనల మేరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. తల్లీపిల్ల క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment