సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు నిర్వహించేందుకు డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.
ఏలూరు, సాక్షి ప్రతినిధి : సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు నిర్వహించేందుకు డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో గతం కంటే ఘనంగా పందేలు నిర్వహించేందుకు బడాబాబులు సన్నద్ధమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పెద్దలు, అధికార యంత్రాంగం అండదండలు తోడవడంతో పందేలకు ఇప్పటికే చాలావరకూ రంగం సిద్ధమైపోయింది. వీటిని అడ్డుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటిలా హెచ్చరికలు జారీ చేస్తున్నా ఖాతరు చేసే పరిస్థితి నిర్వాహకుల్లో కనిపించడంలేదు.
ఏటా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో భీమవరం పరిసర ప్రాంతాలతోపాటు మెట్టలోనూ కొన్నిచోట్ల భారీఎత్తున పందేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భీమవరం పరిసరాల్లో జరిగే పందేలకైతే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారడంసర్వసాధారణ విషయంగా మారిపోరుుంది. వీటిని ఆపడం ఎవరితరం కావడం లేదు. నిర్వాహకుల ధన, అంగ బలానికి అధికారం దాసోహమవుతోంది.
భారీ సన్నాహాలు
నరసాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐ.భీమవరంలో పందేలు సాధారణ ప్రజలు ఊహించని రీతిలో నడుస్తారుు. కోడిపంద్చే పేరు చెబితే రాష్ట్ర స్థారుులో ఐ.భీమవరం పేరు మార్మోగుతుంది. సంక్రాంతి మూడురోజులూ ఇక్కడ నడిచే పందేల విలువ రూ.60 కోట్ల నుంచి రూ.70కోట్లకు పైనే ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి రూ.లక్ష నుంచి రూ. 20 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడ పందాల్లో ఒడ్డుతారు.
ఈసారి పందేలకు ఇప్పటినుంచే బరులను సిద్ధం చేస్తున్నారు. వీఐపీ గ్యాలరీలు కట్టేందుకు సామగ్రిని సిద్ధం చేశారు. భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, భీమవరం మండలంలోని వెంప గ్రామాల్లోనూ కోట్లాది రూపాయల పందేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నారుు.. వెంపలో బరుల కోసం ట్రాక్టర్లతో పొలాలను చదును చేస్తున్నారు. ప్రకృతి ఆశ్రమంలో గ్యాలరీలకు రంగులు వేస్తున్నారు. కాళ్ల మండలం మహదేవపట్నం, జువ్వలపాలెంలోనూ భారీ పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెట్ట ప్రాంతంలోనూ...
జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం తదితర ప్రాంతాల్లోనూ పందేలు పెద్దఎత్తున జరుగుతాయి. కొద్ది సంవత్సరాల నుంచి ఏలూరు సమీపంలోని కొప్పాక, దుగ్గిరాల ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పందేలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పందేలకు బాగా గుర్తింపు వచ్చింది.
నిర్వాహకుల రహస్య సమావేశం
పందేలను ఎలా నిర్వహించాలనే దానిపై నాలుగురోజుల క్రితం డెల్టాలోని పందేల నిర్వాహకులంతా భీమవరం సమీపంలోని ఒక గ్రామంలో సమావేశమైనట్టు తెలిసింది. పందేల నిర్వహణలో అందరూ ఒకే మాటపై ఉండాలని, ఆటంకాలు ఎదురైతే ఎలా ముందుకెళ్లాలనే విషయాలను వారు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఎప్పటి మాదిరిగానే ఇక్కడ జరిగే పందేల జోలికి ఎవరూ రాకుండా ముందే ప్రభుత్వస్థాయి పెద్దలతో మాట్లాడుకోవాలని నిర్ణయించుకు న్నట్టు తెలిసింది. ఇందుకోసం అంతా కలిసి పెద్దమొత్తాల్లో చందాలు కూడా పోగుచేసినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఎవరెవరిని పిలవాలి, పోలీసు ఉన్నతాధికారులు, ఇతరులను ఎలా మేనేజ్ చేయాలి, దేనికెంత ఖర్చవుతుందనే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. పందేలకు రాయలసీమ, తెలంగాణ జిల్లాల ప్రజాప్రతినిధులు, రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితమే భీమవరంలోని లాడ్జిలు, అతిథిగృహాలు, ప్రైవేటు అతిథిగృహాలు బుక్ అయిపోయాయి.
పోలీసుల తీరు మామూలే!
పందేలకు భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. నాలుగు రోజుల క్రితం ఏలూరు రేంజి డీఐజీ విక్రంమాన్‌సింగ్ నరసాపురం వచ్చినప్పుడు పందేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లా అంతటా పందేలకు బరులు సిద్ధమవుతున్నా వాటిని ఆపే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. ఒకవేళ చేసినా చివరి నిమిషంలోనైనా వెనక్కి రాక తప్పదని కిందిస్థాయి పోలీ సు అధికారులు చెబుతున్నారు. పందేల నిర్వాహకులు కీలక వ్యక్తులను రంగంలోకి దింపి తమకు అడ్డురావద్దని అధికారులకు చెప్పించుకోవడం ఏటా జరుగుతోంది. దీనికిమించి అన్ని స్థాయిల్లోని అధికారులను నిర్వాహకులు మామూళ్లతో మత్తెక్కిస్తుండటంతో వారెవరూ నోరు మెదపడం లేదు.