టీటీడీ చైర్మన్ రేసులో మురళీమోహన్
సాక్షి, ఏలూరు : రాష్ట్రంలోని దేవాల యాల పాలకమండళ్లను రద్దుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో టీటీడీ చైర్మన్ పదవిని కనుమూరి బాపిరాజు ఎట్టకేలకు వదులుకోవాల్సి వచ్చింది. టీటీడీ పదవీ కాలం ఈనెల 23 వరకు ఉన్నదృష్ట్యా తనంతట తాను రాజీనామా చేసేది లేదని బాపిరాజు ప్రకటించిన మరుసటి రోజే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయూంశమైంది. టీటీడీ చైర్మన్‌గా 2012 ఆగస్టు 24న బాధ్యతలు చేపట్టిన అప్పటి నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు అంతకుముందు దాదాపు ఏడాదిపాటు ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని ఆశించే వారి జాబితా ఎక్కువైంది.
ఇదే పదవిపై కన్నేసిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈయన కనుమూరి బాపిరాజుకు స్వయూనా బావమరిది కావడం విశేషం. 1970 దశకంలోనే గంగరాజు తండ్రి రంగరాజు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. ఇదిలావుండగా, టీటీడీ కొత్త పాలకవర్గంలో బీజేపీకి చెందిన ఏడుగురు నేతలకు స్థానం కల్పిస్తామని సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పడంతో చైర్మన్ పదవి తనకే దక్కుతుందని గంగరాజు భావిస్తున్నారు.
ఇక రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సైతం టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మాజీ అయిన కనుమూరి బాపిరాజు, గంగరాజు ఒకే సామాజిక వర్గం కావడంతో ఈసారి ఇతర సామాజిక వర్గాలకు పదవిని కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో కోస్తా నేతలకు ఈ పదవి దక్కడంతో ఈసారి రాయలసీమ నేతలకు ఇవ్వాలని టీడీపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమ వారిని వరిస్తుందా.. కోస్తా జిల్లాల వారికి దక్కుతుందా అనేది త్వరలోనే తేలనుంది.