Maganti murali mohan
-
టీడీపీ నేత వాహనంలో రెండు కోట్లు..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీలలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరి ఎస్టేట్ కారులో భారీగా నగదు పట్టుకున్నారు. ఆ కారు మాగంటి రూపకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కారులో దాదాపు 2 కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ రైల్వే స్టేషన్లో ఈ డబ్బు ఎస్ఓటీ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. ఈ మొత్తం డబ్బు కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న ఒక అభ్యర్థికి చేరుతున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. -
సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి?
ఎటూ తేలని టీటీడీ ధర్మకర్తల మండలి భవితవ్యం జీవో ప్రకారం ముగిసిన ఏడాది పదవీ కాలం ప్రమాణస్వీకారం ప్రకారం మే ఒకటి వరకు కొనసాగే అవకాశం పొడిగింపుపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి మార్పులపై సీఎం కసరత్తు, పెరిగిన ఆశావహుల ఒత్తిడి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కొనసాగింపుపై సందిగ్ధం వీడడం లేదు. నిబంధనల ప్రకారం గత బుధవారంతోనే టీటీడీ బోర్డు పదవీకాలం ముగిసింది.అయితే ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేస్తుందా..? లేక పాత పాలకమండలినే కొనసాగిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉండగా బోర్డులో చోటు దక్కించుకునేందుకు అధికారపార్టీ నాయకులతో పాటు, పారిశ్రామిక వేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నియామక ఉత్తర్వులు గత ఏడాది ఏప్రిల్ 26న వెలువడ్డాయి. టీటీడీ చైర్మన్‌గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. ఆమేరకు మే 1వ తేదీన చైర్మన్‌తోపాటు పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ప్రకారం ఈ దర్మకర్తల మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 1న కాబట్టి ఈ ఏడాది మే 1 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. అందువల్లే జీవో ప్రకారం పదవీ కాలం ముగిసినా ప్రమాణస్వీకారం తేదీని దృష్టిలో ఉంచుకుని చైర్మన్‌తోపాటు సభ్యులకు అందాల్సిన మర్యాదలన్నీ గురువారం కూడా కొనసాగించారు. సాయన్నతోపాటు పలువురి మార్పులపై కసరత్తు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు రెండేళ్లు పొడిగించారు. అదే నిర్ణయానే టీటీడీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సభ్యుల్లోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశాలకు వరుసగా నాలుగుసార్లు హాజరుకాలేదు. ఈయన తొలగింపుపై టీటీడీ, ఎండోమెంట్ చట్టంతోపాటు న్యాయ సలహా తీసుకున్నారు. పనిలో పనిగా ఒకరిద్దరు సభ్యులు మార్పుపై కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సీఎంపై మురళీమోహన్, గంగరాజు ఒత్తిడి? టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గురువారం సీఎం చంద్రబాబును కలిసి చర్చించినట్టు ప్రచారం సాగుతోంది. అలాగే, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చర్చ సాగుతోంది. ఇక బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. తాజా బోర్డు ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కొత్త బోర్డుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి వరకు దీనిపై ఎటువంటి స్పష్టమైన నిర్ణయం వెలువడ లేదు. పాత బోర్డు కొనసాగింపా? కొత్త బోర్డు నియామకమా? అన్నది శుక్రవారం తేలిపోనుంది. అలా రానిపక్షంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
స్టార్ నైట్‌తో విరాళాలు సేకరిస్తాం
ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు స్టార్ నైట్ కార్యక్రమం నిర్వహించి విరాళాలను సేకరించనున్నట్టు రాజమండ్రి ఎంపీ, మా అధ్యక్షుడు మాగంటి మురళీమోహన్ వెల్లడించారు. విశాఖలో తుపాను బాధితులకోసం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎంపీ మురళీమోహన్ దాతల సహకారంతో టన్ను పాలపొడి, మంచి నీటి ట్యాంకర్లు, బిస్కెట్లు మంగళవారం పంపించారు. ఆ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ తమ ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షల కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎంపీలందరూ ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా ఇస్తారన్నారు. స్పందించిన వారికి కృతజ్ఞతలు జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రూ. లక్ష, రాజమండ్రి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ రూ.60 వేలు, మరో ఇద్దరు రూ. 80 వేలు విరాళంగా అందజేశారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఈ మొత్తంతో టన్ను పాల పొడి కొనుగోలు చేశామని చెప్పారు. బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా పంపామని, నగర బీజేపీ కార్యకర్తలు లారీతో వాటర్ ప్యాకెట్లు పంపినట్టు తెలి పారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గన్ని కృష్ణ, నల్లమిల్లి జగన్మోహన్రెడ్డి, నాళం నరసింహారావు, నేమాని పట్టాభి రామయ్య, జె. నాగేశ్వరరావు, జె. నూకరాజు, ఎ. రామకృష్ణ, బి. దత్తు, నాళం పద్మశ్రీ పాల్గొన్నారు. అమలాపురం ఎంపీ వితరణ అమలాపురం : విశాఖ బాధితుల సహా యార్ధం అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తన రెండు నెలల జీతం రూ.3 లక్షలను విరాళంగా ప్రకటిం చారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.25లక్షలుఅందిస్త్తున్నట్టు తెలిపారు. -
13 నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తా
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి పర్యటిస్తానని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ తెలిపారు. తాను ప్రస్తుతం గోదావరి పుష్కరాలకు చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించానని లాలాచెరువు సమీపంలోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత తాను ముఖం చాటేశానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్లమెంటు సమావేశాలు జరిగాయని, ఆ తర్వాత లిగ్మెంట్పెయిన్ రావడంతో వైద్యుల సూచనల మేరకు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నానని తెలిపారు. అందువల్లే నియోజకవర్గంలో పర్యటించలేక పోయానన్నారు. రాజకీయాల్లో నీతివంతుడిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను వివిధ జిల్లాల్లో వందలాది ఎకరాల భూములు కొన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ముందు రాజమండ్రిలో నివాసం కోసం కొన్న చిన్నపాటి స్థలం తప్ప తర్వాత ఎక్కడా కొనుగోళ్లు చేయలేదన్నారు. తనకు జిల్లాలో జరుగుతున్న ఇసుక దందాతో సంబంధాలు ఉన్నాయన్న వార్తలను మురళీమోహన్ ఖండించారు. త్వరలో గోదావరి గట్టుపై బాపూ రమణల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. -
టీటీడీ చైర్మన్ రేసులో మురళీమోహన్
సాక్షి, ఏలూరు : రాష్ట్రంలోని దేవాల యాల పాలకమండళ్లను రద్దుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో టీటీడీ చైర్మన్ పదవిని కనుమూరి బాపిరాజు ఎట్టకేలకు వదులుకోవాల్సి వచ్చింది. టీటీడీ పదవీ కాలం ఈనెల 23 వరకు ఉన్నదృష్ట్యా తనంతట తాను రాజీనామా చేసేది లేదని బాపిరాజు ప్రకటించిన మరుసటి రోజే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయూంశమైంది. టీటీడీ చైర్మన్‌గా 2012 ఆగస్టు 24న బాధ్యతలు చేపట్టిన అప్పటి నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు అంతకుముందు దాదాపు ఏడాదిపాటు ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని ఆశించే వారి జాబితా ఎక్కువైంది. ఇదే పదవిపై కన్నేసిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈయన కనుమూరి బాపిరాజుకు స్వయూనా బావమరిది కావడం విశేషం. 1970 దశకంలోనే గంగరాజు తండ్రి రంగరాజు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. ఇదిలావుండగా, టీటీడీ కొత్త పాలకవర్గంలో బీజేపీకి చెందిన ఏడుగురు నేతలకు స్థానం కల్పిస్తామని సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పడంతో చైర్మన్ పదవి తనకే దక్కుతుందని గంగరాజు భావిస్తున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సైతం టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మాజీ అయిన కనుమూరి బాపిరాజు, గంగరాజు ఒకే సామాజిక వర్గం కావడంతో ఈసారి ఇతర సామాజిక వర్గాలకు పదవిని కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో కోస్తా నేతలకు ఈ పదవి దక్కడంతో ఈసారి రాయలసీమ నేతలకు ఇవ్వాలని టీడీపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమ వారిని వరిస్తుందా.. కోస్తా జిల్లాల వారికి దక్కుతుందా అనేది త్వరలోనే తేలనుంది. -
గోదావరి కుంభమేళాకు భారీ ఏర్పాట్లు
రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ దేవరపల్లి / ద్వారకాతిరుమల: వచ్చే ఏడాది ఆగస్టులో జరుగనున్న గోదావరి కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ చెప్పారు. దేవరపల్లి, ద్వారకా తిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 144 ఏళ్లకు ఒకసారి గోదావరి కుంభమేళా వస్తుందని.. వచ్చే ఏడాది రానున్న కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశముందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గోదావరి ఒడ్డున ప్రత్యేక స్నానఘట్టాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. కొవ్వూరు, రాజ మండ్రిలో స్నానఘట్టాలను పరి శీలిం చి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్ల్లాట్ఫారాలను విస్తరించాలి కొవ్వూరు, నిడదవోలు, రాజమండ్రి, గోదావరి రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారాలను విస్తరించాల్సి ఉందని ఎంపీ అన్నారు. ఇందుకు రైల్వే మంత్రి సదానంద గౌడ్‌ను కలిసి మాట్లాడానని చెప్పారు. రాజమండ్రిలో అండర్ డ్రైయినేజీ నిర్మాణం, పేపర్ మిల్లు నుంచి వచ్చే వ్యర్థ నీటిని గోదావరిలో వదలకుండా ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటుచేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నామన్నారు. పట్టణాల్లోని మురుగునీటిని గోదావరిలోకి వదలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడిని కలిసి నిధులు మంజూరు చేయమని కోరామన్నారు. రేవుల వద్ద విశ్రాంతి షెడ్లను నిర్మించాల్సి ఉందని ఎంపీ మురళీమోహన్ అన్నారు. త్వరలో అధికారులతో సమావేశం కుంభమేళా ఏర్పాట్లపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఎంపీ చెప్పారు. కొవ్వూరు-రాజమండ్రి హేవలాక్ బ్రిడ్జిని టూరిజం ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణం కోసం కృషిచే స్తున్నామని తెలిపారు. కుంభమేళా కోసం ఏర్పాట్లను 10 నెలల్లో పూర్తి చేసేం దుకు ప్రణాళికలు తయారు చేయాల ని అధికారులకు సూచించారు. వంతెనల మరమ్మతులకు హామీ పోలవరం, తాడిపూడి కాలువలపై ఉన్న వంతెనల జాయింట్లు దెబ్బతినటంతో ప్రమాదాలు జరుగు తున్నాయని టీడీపీ నాయకులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సంబందిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో ఆర్ గోవిందరావు, తహసిల్దార్ అక్బర్ హుస్సేన్, సీఐ ఎం.బాలకృష్ణ, టీడీపీ సుంకర దుర్గారావు, ముళ్లపూడి వెంకట్రావు, కొయ్యలమూడి చినబాబు పాల్గొన్నారు.