గోదావరి కుంభమేళాకు భారీ ఏర్పాట్లు
రాజమండ్రి ఎంపీ మురళీమోహన్
దేవరపల్లి / ద్వారకాతిరుమల: వచ్చే ఏడాది ఆగస్టులో జరుగనున్న గోదావరి కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ చెప్పారు. దేవరపల్లి, ద్వారకా తిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 144 ఏళ్లకు ఒకసారి గోదావరి కుంభమేళా వస్తుందని.. వచ్చే ఏడాది రానున్న కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశముందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గోదావరి ఒడ్డున ప్రత్యేక స్నానఘట్టాలు నిర్మించాల్సి ఉందని చెప్పారు. కొవ్వూరు, రాజ మండ్రిలో స్నానఘట్టాలను పరి శీలిం చి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ప్ల్లాట్‌ఫారాలను విస్తరించాలి
కొవ్వూరు, నిడదవోలు, రాజమండ్రి, గోదావరి రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫారాలను విస్తరించాల్సి ఉందని ఎంపీ అన్నారు. ఇందుకు రైల్వే మంత్రి సదానంద గౌడ్‌ను కలిసి మాట్లాడానని చెప్పారు. రాజమండ్రిలో అండర్ డ్రైయినేజీ నిర్మాణం, పేపర్ మిల్లు నుంచి వచ్చే వ్యర్థ నీటిని గోదావరిలో వదలకుండా ఫిల్టర్ బెడ్‌ను ఏర్పాటుచేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నామన్నారు. పట్టణాల్లోని మురుగునీటిని గోదావరిలోకి వదలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడిని కలిసి నిధులు మంజూరు చేయమని కోరామన్నారు. రేవుల వద్ద విశ్రాంతి షెడ్లను నిర్మించాల్సి ఉందని ఎంపీ మురళీమోహన్ అన్నారు.
త్వరలో అధికారులతో సమావేశం
కుంభమేళా ఏర్పాట్లపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఎంపీ చెప్పారు. కొవ్వూరు-రాజమండ్రి హేవలాక్ బ్రిడ్జిని టూరిజం ప్రాజెక్టుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణం కోసం కృషిచే స్తున్నామని తెలిపారు. కుంభమేళా కోసం ఏర్పాట్లను 10 నెలల్లో పూర్తి చేసేం దుకు ప్రణాళికలు తయారు చేయాల ని అధికారులకు సూచించారు.
వంతెనల మరమ్మతులకు హామీ
పోలవరం, తాడిపూడి కాలువలపై ఉన్న వంతెనల జాయింట్లు దెబ్బతినటంతో ప్రమాదాలు జరుగు తున్నాయని టీడీపీ నాయకులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సంబందిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో ఆర్ గోవిందరావు, తహసిల్దార్ అక్బర్ హుస్సేన్, సీఐ ఎం.బాలకృష్ణ, టీడీపీ సుంకర దుర్గారావు, ముళ్లపూడి వెంకట్రావు, కొయ్యలమూడి చినబాబు పాల్గొన్నారు.