పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలి
Published Wed, Aug 21 2013 12:31 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
దుబ్బాక,న్యూస్‌లైన్:పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మంగళవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దుబ్బాకలో సద్భావన ర్యాలీ నిర్వహించారు. పలువురు పాఠశాల, కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆనంతరం తెలంగాణ తల్లి చౌరాస్తాలో టీఆర్‌ఎస్ నాయకులు, విద్యార్థులు మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ , దాని మిత్ర పక్షాలు సానుకూల నిర్ణయం తీసుకోవటం సంతోషకరమన్నారు.
త్వరలోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ అధిష్టానం సూచనల మేరకు నియోజకవర్గంలో సద్భావన ర్యాలీ నిర్వహించామన్నారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు కృత్రిమ ఉద్యమం చేపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు కుట్ర పన్నుతున్నారని, వారి కుట్రలను విచ్ఛిన్నం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ రవీందర్, నాయకులు సిద్దిరాములు, ఎల్లారెడ్డి, ఆస స్వామి, శ్రీరాములు, కైలాష్, పద్మయ్య, పెంటయ్య, రామస్వామిగౌడ్, రొట్టె రమేష్, కాల్వ నరేష్, రాజు, భూంరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు
Advertisement