ఆత్మీయ సదస్సులో మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. అన్ని వర్గాలను మోసగించిన సీఎం చంద్రబాబును ప్రజలు క్షమించరని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరం పీఎన్‌కాలనీ రెండో లైన్‌లో సోమవారం వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వాడ మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా ఉన్న నాయుకుడు ధర్మాన ప్రసాదరావు అని కొనియాడారు. ఇటువంటి నాయకుడు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఉండడం సిక్కోలువాసులు చేసుకున్న అదృష్టమన్నారు.
చంద్రబాబునాయుడు తొలుత రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని చెప్పి.. తర్వాత ప్రత్యేక ప్యాకేజీతోనే అనేక లాభాలుంటాయని యూటర్న్ తీసుకున్నారని గుర్తు చేశారు. తర్వాత మళ్లీ మాటమార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు విసుగుచెందిన ప్రజలు వైఎస్సార్‌సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లతోనే ఓడిపోయామని, ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు పార్టీ నాయకులంతా కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అంధవరపు వరహనరసింహం (వరం), ఎం.వి.పద్మావతి, మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, పి.జె నాయుడు, రేఖా తదితరులు పాల్గొన్నారు.
ధర్మానకు అస్వస్థత
ఆత్మీయ సదస్సుకి హాజరైన ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మాన జ్వరంతో ఉన్నప్పటికి మీ ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరయ్యారని చెప్పిన మరుక్షణంలోనే కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment