పల్లెల్లో డేంజర్‌ బెల్స్‌ | Dengue Fever Cases Increased In East Godavari | Sakshi
Sakshi News home page

పల్లెల్లో డేంజర్‌ బెల్స్‌

Published Mon, Jul 29 2019 10:36 AM | Last Updated on Mon, Jul 29 2019 10:36 AM

Dengue Fever Cases Increased In East Godavari - Sakshi

రోడ్డు పక్కన పడేసిన ఖాళీ కొబ్బరి బొండాలు, పందుల సంచారం

సాక్షి కాకినాడ(తూర్పుగోదావరి) :  జిల్లాలోని గ్రామాల్లో డెంగీ బెల్స్‌ మోగుతున్నాయి. ఇప్పటికే శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామంలో 19 మందికి డెంగీ సోకడంతో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా కాకినాడ రూరల్‌ పండూరు, కరప, తూరంగి, శంఖవరం, ఏలేశ్వరం, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ అర్బన్లతోపాటు పిఠాపురం, తుని, ముమ్మిడివరం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, తదితర మండలాల్లో విష జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నారు. జగ్గంపేట మండలంలో ముగ్గురు వ్యక్తులు డెంగీ బారిన పడితే అందులో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, శంఖవరం, ఏలేశ్వరం ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అత్యధిక సంఖ్యలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 103 డెంగీ కేసులు అధికారికంగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల్లోకి రాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఇంత జరుగుతున్నా వైద్యశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమతున్నాయి.

పారిశుద్ధ్యం అధ్వానం
జిల్లాలో జ్వరాల తీవ్రతకు పారిశుద్ధ్య లోపమే ప్రధాన కారణం. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలూ దోమలు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని చాలా ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందడం లేదు. ఏటా జ్వరాలు పెరుగుతున్నా, మరణాలు నమోదవుతున్నా, పారిశుద్ధ్యం మెరుగుదలకు, తాగునీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోంది. అయినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ వీటిని తగిన రీతిలో వినియోగించడం లేదు. జ్వరాల తీవ్రతను తగ్గించాలంటే గ్రామ, పట్టణ, నగరాల్లో జ్వరాల పట్ల చైతన్యం కల్పించడం, మరింత మెరుగుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడమే మార్గమని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు.

వివిధ జ్వరాల లక్షణాలివీ..
మలేరియా : విపరీతమైన చలి, చెమట, తల పట్టేయడం, వాంతులతో కూడిన జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. సమీప ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి.
వైరల్‌ జ్వరం : జలుబు, దగ్గుతో పాటు జ్వరం వస్తే వైరల్‌ ఫీవర్‌గా అనుమానించాలి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తి నోరు, ముక్కుకు రుమాలు పెట్టుకోవాలి. లేకుంటే ఈ వైరస్‌ సులభంగా మరో వ్యక్తికి వ్యాపిస్తుంది.
టైఫాయిడ్‌ : ఒక్కసారిగా 100 నుంచి 102 డిగ్రీల జ్వరం రావడం, మళ్లీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా రోజుకు నాలుగైదుసార్లు ఉంటుంది. వారం రోజుల పాటు ఇలాగే ఉంటే టైఫాయిడ్‌గా భావించాలి. రక్తపరీక్ష ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కలుషిత నీరు, ఫంగస్‌ వల్ల టైఫాయిడ్‌ వ్యాపిస్తుంది.

చికున్‌ గున్యా : తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చి, కొద్ది రోజులుండి మళ్లీ తిరగబెడితే చికున్‌ గున్యా జ్వరంగా భావించాలి. ఒకసారి ఈ జ్వరం బారిన పడితే నీరసం, నొప్పుల నుంచి తేరుకునేందుకు చాలా కాలం పడుతుంది. 103 నుంచి 104 డిగ్రీల జ్వరం ఒక్కసారిగా వస్తుంది. శరీరంలోని అన్ని కీళ్లల్లో నొప్పులు ఆరంభమై కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్లు, చేతులు వాపులు వస్తాయి. దోమకాటు వల్లనే ఇది వ్యాప్తి చెందుతుంది.

డెంగీ : హఠాత్తుగా జ్వరంతో పాటు కాళ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు, కండరాల్లో విపరీతమైన నొప్పి వస్తే డెంగీగా అనుమానించాలి. జ్వరం వచ్చిన రెండో రోజు నుంచి వెన్నెముక నొప్పి, కనుబొమ్మల వాపు, వాంతులు, నీరసం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు వస్తాయి. వారం రోజుల పాటు అలాగే ఉంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ శాతం పడిపోతుంది. ఒకసారి వచ్చిన జ్వరం పది రోజుల్లోగా మళ్లీ తిరగబెడుతుంది. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన ఈ వ్యాధి తీవ్రస్థాయి లక్షణాలు. వ్యాధి నిర్ధారణ కేవలం ఎలీసా (ఐజీజీ, ఐసీఎం) విధానంలో చేస్తారు. ఇది కేవలం దోమ కారణంగానే వ్యాప్తి చెందుతుంది. పూర్తిగా వైద్యుని పర్యవేక్షణలోనే ఉండాలి.

ప్లేట్‌లెట్లకు కొరత
డెంగీ సోకిన వారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తగ్గితే వారికి వైద్యులు నిత్యం చికిత్స చేయాలి. 30, 40 వేలకు తగ్గినట్లయితే ఈ కణాలను దాతల నుంచి సేకరించి రోగుల శరీరంలోకి ఎక్కించాల్సి ఉంది. దీంతో ప్లేట్‌లెట్లు అవసరమైన వారు రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కాకినాడలో రెడ్‌క్రాస్, రోటరీ బ్లడ్‌ బ్యాంకులు కొంత ఆదుకుంటున్నా బాధితుల సంఖ్యకు తగినట్టుగా వీటిని అందివ్వడం వీటికి కష్టతరంగా మారుతోంది. కాకినాడ జీజీహెచ్‌ తదితర ప్రాంతాలకు వైద్య నిమిత్తం వస్తున్న వ్యాధిగ్రస్తులు, వ్యాధి సోకిన వారి బంధువులు రక్తనిధి కేంద్రాలకు వెళ్లి ప్లేట్‌లెట్లు దొరకక నిరాశ చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement