
జిల్లా పర్యాటకానికి మళ్లీ అన్యాయమే
కడప కల్చరల్ : జిల్లా పర్యాటక రంగానికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీవద్ యశో నారాయణ మంగళవారం పార్లమెంటులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను లిఖిత పూర్వకంగా వివరించారు. తెలంగాణపై ఎనలేని ప్రేమ చూపి రెండు ‘మెగా సర్క్యూట్ ప్రాజెక్టు’లను ఇచ్చారు. మన రాష్ట్రానికి మెగా ప్రాజెక్టులు లేకపోగా, సాధారణ సర్క్యూట్ విభాగంలో పది ప్రాజెక్టులను కేటాయించారు.
అందులో గుంటూరుకు మూడు కేటాయించి పశ్చిమ గోదావరికి రెండు, చిత్తూరు (శ్రీకాళహస్తి)కు ఒకటి ఇచ్చారు. నెల్లూరులో ఫ్లెమింగో ఉత్సవాలకు మరోమారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయలసీమలో అనంతపురం లేపాక్షి ఉత్సవాలకు అనుమతి ఇచ్చారు. ఇందులో కడప జిల్లాకు మాత్రం ప్రాధాన్యత లభించలేదు. జిల్లాను విస్మరించడం పట్ల పర్యాటకాభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రాబల్యం గల ప్రాంతాలలో మాత్రమే పర్యాటక ప్రాజెక్టులు, ఉత్సవాలను మంజూరు చేసి వైఎస్సార్ జిల్లా మాత్రం ఈ రాష్ట్రంలోనిది కాదన్నట్లు పాలకులు ప్రవర్తించడం సరికాదంటున్నారు.
పెద్దదర్గా అభివృద్ధి ఊసేలేదు?
నిన్నటి కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి చిరంజీవి కడప అమీన్‌పీర్ దర్గా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయించారు. రూ. 2.50 కోట్లతో ఈ ప్రాజెక్టుకు గతేడాది నాటి పర్యాటకశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, స్థానిక మంత్రులు దర్గాలో శంకుస్థాపన చేశారు. కానీ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ఈ దర్గా అభివృద్ధి ప్రస్తావన లేదు. దీంతో దర్గా అభివృద్ధిని పక్కన పెట్టేశారా అన్న అనుమానం వస్తోంది. జిల్లాలోని పర్యాటకాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి ఉత్సవాల సాధనకు కృషి చేయకపోతే ఈ ఐదేళ్లలో జిల్లాకు ఏ ఉత్సవం దక్కకపోయే ప్రమాదం ఉంది.
కక్ష సాధింపు తగదు
2012లో రాష్ట్ర మంతటా పర్యాటక ఉత్సవాలు ప్రకటించి మన జిల్లాకు మొండి చేయి చూపారు. కష్టపడి సాధించుకున్నా ఫలితం దక్కలేదు. ఈసారి జిల్లా ఊసే లేకపోవడం బాధాకరం. ఉత్సవాల విలువ తెలుసుకొని కలిసికట్టుగా వాటిని సాధించుకోవాల్సిన అవసరముంది.
- సీతారామయ్య, చైర్మన్,
జిల్లా పర్యాటక అభివృద్ధి సమితి
ఉపాధి అవకాశాలను కోల్పోతున్నాం
పర్యాటక రంగంలో ముందున్న జిల్లాలకే మళ్లీ మళ్లీ ఉత్సవాలను కేటాయించడం ఏం న్యాయం. ఈ విషయంగా వెనుకబడి ఉన్న మన జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తే అటు ఉపాధి, ఇటు వ్యాపారం, రవాణా తదితర రంగాలలో అభివృద్ధి జరుగుతుంది. జిల్లా అభివృద్ధిని కాక్షించే వారందరూ ఈ ఉత్సవాల సాధనకు నడుం బిగించాలి. ఉత్సవాలు దక్కకపోవడం జిల్లాకు నష్టమే.
- ఎస్.ఎలియాస్‌రెడ్డి,
కన్వీనర్, ఇంటాక్, కడప చాఫ్టర్
జిల్లాకు తీవ్ర నష్టం..
వరుస కరువులతో కటకటలాడుతున్న మన జిల్లాలో పర్యాటకం పట్ల పర్యాటకాభిమానులు, మేధావులు ఆశలు పెంచుకున్నారు. అదొక్కటే జిల్లాలో అంతో ఇంతో ఉపాధి, వ్యాపారాల అభివృద్ధికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. 2012లో జిల్లాకు పోరాడి సాధించుకున్న గండికోట పర్యాటక ఉత్సవాలు కొందరు అవగాహన లేని ప్రజాప్రతినిధుల స్వార్థానికి బలయ్యాయి. 2012 నుంచి 2014 వరకు అధికారులు ఉత్సవాల నిర్వహణకు నడుం కట్టినా వారు అడ్డు తగులుతూ సైంధవ పాత్ర వహించి రద్దు చేయిస్తూ వచ్చారు. గట్టిగా అడిగే వారు, నిలదీసే వారు లేక ఆ ఉత్సవాలకు తెరపడింది.
అప్పట్లో అనంతపురంలో లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో ప్రస్తుతం మరోమారు ఆ ఉత్సవాలను కేటాయించారు. ఇప్పటికీ ఆ జిల్లాలోని పెనుగొండలో శ్రీకృష్ణ దేవరాయల 504 పట్టాభిషేక ఉత్సవాలకు స్థానికుల ఒత్తిడిపై కలెక్టర్ అభ్యర్థనతో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఇప్పుడు లేపాక్షి ఉత్సవాలతో ఆ జిల్లాకు రెండు ఉత్సవాలు దక్కినట్లయింది. మన జిల్లాకు మాత్రం ఒక్కటి కూడా మంజూరు కాలేదు.
సీమలోని కర్నూలులో రచయితల ఉత్సవాలు, చిత్తూరులో శ్రీకాళహస్తి, అనంతలో లేపాక్షి, రాయల ఉత్సవాలు జరగనుండగా, మన జిల్లాకు మాత్రం ఒక్క ఉత్సవాన్ని కూడా కేటాయించకపోవడం అన్యాయమని, ఇది వైఎస్సార్ జిల్లాపై కక్ష సాధింపేనని పర్యాటకాభివృద్ధి కాంక్షిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఉత్సవాలను ఏర్పాటు చేసింది డాక్టర్ వైఎస్సార్‌యేనని, ప్రస్తుతం ఆ జిల్లాకు ఒక్క ఉత్సవం కూడా మంజూరు చేయకపోవడం అన్యాయమంటున్నారు.