కందుకూరు, న్యూస్‌లైన్: పంచాయతీ ఎన్నికల్లో మొదటి నుంచి వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ వచ్చాయి. చివరకు ఆ బంధం ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ కొనసాగింది. గత నెల 27న పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా అప్పట్లో నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు కూడా గ్రామాల్లో సర్పంచ్ పదవులతో పాటు ఉప సర్పంచ్ పదవులు వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థుల పరంకాకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డాయి. అప్పట్లో వాయిదా పడిన పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు మంగళవారం రిటర్నింగ్ అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో దాదాపు 30కి పైగా పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. వాటిల్లో పదికి పైగా పంచాయతీల్లో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను ఉప సర్పంచ్‌లుగా కాకుండా అడ్డుకునే యత్నం చేశాయి. అయితే ఆ రెండు పార్టీల ఎత్తుగడలను చిత్తు చేస్తూ వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నియోజకవర్గంలోని రెండు మేజర్ పంచాయతీల్లో ఒకటైన కరేడు పంచాయతీ ఉప సర్పంచ్ పదవిని వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి పోలుబోయి భాస్కర్ ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. కరేడు పంచాయతీలో ఎనిమిది వార్డులను వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ టీడీపీ ఆరు, కాంగ్రెస్‌కు ఇద్దరు మాత్రమే వార్డు సభ్యులున్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కవ్వాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కానీ ఉలవపాడులో మాత్రం ఆ రెండు పార్టీలు ఏకమై వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఉప సర్పంచ్ కాకుండా అడ్డుకున్నాయి. ఇక్కడ టీడీపీకి ఆరు, కాంగ్రెస్‌కు మూడు వార్డు సభ్యుల బలం ఉంది. దీంతో ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థి దగ్గుమాటి మాల్యాద్రికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆయన ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఉప సర్పంచ్‌లు కానివ్వకుండా చూడాలని, అవసరమైతే టీడీపీతో జతకట్టయినా అడ్డుకోవాలని సంకేతాలిచ్చినట్లు సమాచారం.
ఉలవపాడు మండలంలో టీడీపీ నేతల రాజీనామా...
టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చేష్టలకు నిరసనగా మండలంలో పలువురు టీడీపీ నాయకులు మంగళవారం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. కరేడు టీడీపీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఒకటో వార్డు మెంబర్ పోలుబోయిన శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా పంచాయతీ ఐదో వార్డు సభ్యురాలు పోలుబోయిన కళ్యాణి కూడా టీడీపీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితో పాటు సింగిల్ విండో డెరైక్టర్ రేగలగడ్డ బ్రహ్మయ్య తన పదవితో పాటు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు ఉలవపాడు, కరేడు పంచాయతీల్లోని దాదాపు వంద మందికి పైగా రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వివక్షపూరిత చర్యలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలో అగ్రకుల అహంకారం పెచ్చుమీరిపోయిందని రాజీనామా లేఖలో ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బీసీలపై పార్టీలో వివక్షత పెరిగిందని, మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గాన్ని అణచివేసే ధోరణితో శివరాం ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామం లోనూ బీసీలపై వివక్షత చూపుతున్నారని భవిష్యత్‌లో అనేక మంది నాయకులు పార్టీని వీడి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ కుమ్మక్కు కుట్రలు
Published Wed, Aug 7 2013 3:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement