దేవుని సాక్షిగా ముడిపడిన ఆ బంధం.. చెరిగిపోని జ్ఞాపకాలకు వేదికగా నిలిచింది. సుఖ దుఃఖాలను కలిసి పంచుకుని.. కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచారు. చేతిలో చెయ్యేసి.. అడుగులో అడుగేసి.. సాగించిన వీరి పయనం ‘కడదాకా’ కలిసే సాగింది. అనారోగ్యం ఆయన ఊపిరి తీస్తే.. భర్త లేని లోకం శూన్యమని ఆమె కూడా తనువు చాలించింది. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తల మరణంతో ఉయ్యాలవాడ మూగబోయింది.
ఉయ్యాలవాడ(ఓర్వకల్లు): ఊరంతా కన్నీటి సంద్రమైంది. గంటల వ్యవధిలో దంపతుల హఠాన్మరణం అందరినీ కదిలించింది. అయ్యో.. అని బాధపడుతూనే, చావు కూడా విడదీయలేని ఆ బంధం ఎన్నెన్ని జన్మలదోనని కీర్తించారు. ఈ ఘటన మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం దేవానందం(78), శివమ్మ(75) దంపతులకు కూలీ పనులే ఆధారం. ఇరువురు సంతానం కాగా.. రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరినీ ఓ ఇంటి వాళ్లను చేశారు. పెద్ద కొడుకు ఏసయ్య స్వగ్రామంలోనే కూలీ పనులు చేస్తుండగా.. చిన్న కొడుకు దానమయ్య కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
ఇక శేష జీవితం సంతోషంగా గడిపే క్రమంలో చిన్న కుమారుని వద్దే ఉండిపోయారు. నాలుగు రోజుల క్రితం దేవానందం స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కోలుకోలేక సోమవారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస వదిలాడు. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు చివరి చూపునకు వస్తున్న తరుణంలో మంగళవారం ఉదయం శివమ్మ కూడా భర్తనే అనుసరించింది. ఆయన మృతదేహం వద్దే ప్రాణం విడవటం చూసి స్థానికుల హృదయం బరువెక్కింది. ఈ విషాదం తెలిసి గ్రామస్తులంతా ఆ ఇంటి వద్ద చేరి కన్నీళ్లతో నివాళులర్పించారు. మధ్యాహ్నానికి కుటుంబ సభ్యులు, స్థానిక సీఎస్‌ఐ పెద్దల ఆధ్వర్యంలో క్రైస్తవ మత సాంప్రదాయంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆయనే లోకం!
Published Wed, Apr 6 2016 5:13 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement