uyyalawada
-
ఉయ్యాలవాడ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు కేవీఆర్ కళాశాల అధ్యాపకులు ఇమానుయేల్, ఆనందారెడ్డి రచించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి తుగ్గలిలో శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితలు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ నాయకుడు సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉయ్యాలవాడకు ‘అనంత’ నీరాజనాలు
ఉయ్యాలవాడకు ‘అనంత’ నీరాజనాలు – జాతీయ యోధుడిగా గుర్తించాలని సంతకాల సేకరణ ఉద్యమం అనంతపురం కల్చరల్ : తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనంత వాసులు నీరాజనాలర్పించారు. నరసింహారెడ్డిని జాతీయ యోధుడిగా గుర్తించాలని శనివారం సంతకాల సేకరణ జరిగింది. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టవర్‌క్లాక్ వద్ద జరిగిన సంతకాల సేకరణకు రాజకీయ పార్టీలకతీతంగా నాయకులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. కమ్యూనిస్టు నాయకులు రామకృష్ణ, జగదీష్, రమణ తదితరులు మాట్లాడుతూ ఉత్తరాదికి చెందిన స్వాతంత్య్ర సమర యోధులకు ఇచ్చిన గౌరవంలో దక్షిణాది ప్రాంత యోధులకు ఇవ్వకపోవడం విచారకరమని ఆవేదన వెలిబుచ్చారు. ఉయ్యాలవాడ జన్మించిన కర్నూలుకు కూడా తగిన ప్రాధాన్యత లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఆయన జీవితంపై సినిమా వస్తోందని తెలిసిన తర్వాతే ఆయన గురించి ఆలోచించడం మొదలు పెట్టారన్నారు. నిర్వాహకులు జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కంటే ముందు ఆంగ్లేయులను ఎదిరించిన విప్లవమూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు రావాలన్నదే తమ ధ్యేయమన్నారు. గత మే నెలలో తమిళనాడు నుంచి ఉద్యమం ప్రారంభించామన్నారు. ‘వాడవాడలా ఉయ్యాల వాడ మాట..యువతకు నూతన బాట’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉయ్యాలవాడ చరిత్రకు గుర్తింపు తెస్తామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయామన్నారు. ఆమోదించిన తీర్మానాలు : అనంతరం ప్రజా సంఘాల సమక్షంలో పలు తీర్మానాలు ఆమోదించారు. తొలి స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను భావితరం వారికి స్పూర్తినందించడానికి పాఠ్యాంశాలుగా పెట్టాలని, ఉయ్యాల వాడ వర్ధంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, ఆయనను ఉరి తీసిన జుర్రేటి వాగు ప్రాంతంలో మెమోరియల్‌హాలు నిర్మించి స్మృతివనంగా మార్చాలని, పార్లమెంటులో ఆయన విగ్రహం ప్రతిష్టించడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో ఆయన విగ్రహాలుండాలని, కర్నూలుకు ఉయ్యాల వాడ పేరు పెట్టాలని, ప్రత్యేక స్టాంపు విడుదల చేయాలని తీర్మానించారు. అంతకు ముందు రెడ్డి పరివార్ సంఘం నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు. -
చిరస్మరణీయులు..రేనాటి సూర్యచంద్రులు
ఉయ్యాలవాడ: రేనాటి సూర్యచంద్రులు.. చిరస్మరణీయులని రాయలసీమ ఐడీసీ ఎస్ఈ శివారెడ్డి అన్నారు. శనివారం ఉయ్యాలవాడలోని బుడ్డా విశ్వనాథరెడ్డి స్వగృహంలో బుడ్డా వెంగళరెడ్డికి విక్టోరియా మహారాణి బహూకరించిన బంగారు పతకాన్ని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీద విడుదల చేయనున్న పోస్టల్ స్టాంప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాయలసీమ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఉయ్యాలవాడ మండలంలోని బోడెమ్మనూరు, ఉయ్యాలవాడ గ్రామాల్లో రూ. 3.30 కోట్లతో జరుగుతున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాను పరిశీలించామన్నారు. కుందూనదికి అనుసంధానంగా మల్లెవేముల, జూపాడుబంగ్లా, టంగుటూరు, జుర్రేరు.. అలాగే ఎస్సార్బీసీకి అనుసంధానంగా అక్కజమ్మ రిజర్వాయర్ పరిధిలోఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుందూనదికి అనుసంధానంగా రూ. 10 కోట్లతో లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం పనులు కొనసాగుతుండగా, రిజర్వాయర్ల పరిధిలో ఏర్పాటుకు రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట డీఈ తిమ్మన్న, సిబ్బంది ఉన్నారు. -
‘ఉయ్యాలవాడ’ కు హీరో శ్రీకాంత్ నివాళి
కోవెలకుంట్ల : తెల్లదొరలపాలిట సింహాస్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ నివాళులర్పించారు. ఓ న్యూస్‌చానల్ ఆ«ధ్వర్యంలో నిర్మిస్తున్న విప్లవ నరసింహారెడ్డి సీరియల్లో నటించేందుకు గురువారం హీరో పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని బ్రిటీష్ ట్రెజరీ ప్రాంతంలో ఉన్న నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నరసింహారెడ్డి ట్రెజరీ కొల్లగొట్టిన ప్రాంతం, ఆయనను ఉరి తీసిన జుర్రేరు, బ్రిటీష్వారికి నరసింహారెడ్డి పట్టుబడిన జగన్నాథగట్టు ప్రాంతంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినీహీరోకు రాయలసీమ జేఏసీ కో ఆర్డినేటర్ కామని వేణుగోపాల్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి, లైబ్రేరియన్ నరసింహారెడ్డి ఘన స్వాగతం పలికారు. లొకేషన్ల పరిశీలన బనగానపల్లె : సినీ హీరో శ్రీకాంత్ పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పార్క్‌ను గురువారం పరిశీలించారు. ఓ న్యూస్‌చానల్ ఆ«ధ్వర్యంలో నరసింహారెడ్డిపై సీరియల్ తెరకెక్కిస్తున్నట్లు హీరో తెలిపారు. త్వరలో సినీ నటుడు చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సినిమా చిత్రీకరించనున్నామని, ఇందుకోసం లోకేషన్లు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి దంపతులు ఉన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
ఓర్వకల్లు: భార్యాభర్తల మధ్య కలహాలు ఒకరి ప్రాణం తీశాయి. తెల్లారితే ఆనందంగా పండుగ నిర్వహించాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా (డీజిల్బాష)కు కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన కుర్షిద్జహ (32)తో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కుమారులు ఇద్దరు హైదరాబాద్‌లో పాలిష్కట్టర్లుగా పని చేస్తున్నారు. భర్త మహబూబ్‌బాష ఊర్లోనే డీజిల్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం భార్యాభర్తలు ఇద్దరు ఓ రైతు పొలానికి కూలీకి వెళ్లారు. అక్కడే కుటుంబ కలహాలతో ఇద్దరు వాగ్వాదపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన కుర్షిద్జహా సాయంత్రం ఇంటికి చేరుకుని పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మంగళవారం మతి చెందింది. మతురాలి సోదరుడు షేక్షావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆయనే లోకం!
దేవుని సాక్షిగా ముడిపడిన ఆ బంధం.. చెరిగిపోని జ్ఞాపకాలకు వేదికగా నిలిచింది. సుఖ దుఃఖాలను కలిసి పంచుకుని.. కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచారు. చేతిలో చెయ్యేసి.. అడుగులో అడుగేసి.. సాగించిన వీరి పయనం ‘కడదాకా’ కలిసే సాగింది. అనారోగ్యం ఆయన ఊపిరి తీస్తే.. భర్త లేని లోకం శూన్యమని ఆమె కూడా తనువు చాలించింది. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తల మరణంతో ఉయ్యాలవాడ మూగబోయింది. ఉయ్యాలవాడ(ఓర్వకల్లు): ఊరంతా కన్నీటి సంద్రమైంది. గంటల వ్యవధిలో దంపతుల హఠాన్మరణం అందరినీ కదిలించింది. అయ్యో.. అని బాధపడుతూనే, చావు కూడా విడదీయలేని ఆ బంధం ఎన్నెన్ని జన్మలదోనని కీర్తించారు. ఈ ఘటన మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం దేవానందం(78), శివమ్మ(75) దంపతులకు కూలీ పనులే ఆధారం. ఇరువురు సంతానం కాగా.. రెక్కలు ముక్కలు చేసుకుని ఇద్దరినీ ఓ ఇంటి వాళ్లను చేశారు. పెద్ద కొడుకు ఏసయ్య స్వగ్రామంలోనే కూలీ పనులు చేస్తుండగా.. చిన్న కొడుకు దానమయ్య కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇక శేష జీవితం సంతోషంగా గడిపే క్రమంలో చిన్న కుమారుని వద్దే ఉండిపోయారు. నాలుగు రోజుల క్రితం దేవానందం స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కోలుకోలేక సోమవారం ఆసుపత్రిలోనే తుదిశ్వాస వదిలాడు. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు చివరి చూపునకు వస్తున్న తరుణంలో మంగళవారం ఉదయం శివమ్మ కూడా భర్తనే అనుసరించింది. ఆయన మృతదేహం వద్దే ప్రాణం విడవటం చూసి స్థానికుల హృదయం బరువెక్కింది. ఈ విషాదం తెలిసి గ్రామస్తులంతా ఆ ఇంటి వద్ద చేరి కన్నీళ్లతో నివాళులర్పించారు. మధ్యాహ్నానికి కుటుంబ సభ్యులు, స్థానిక సీఎస్ఐ పెద్దల ఆధ్వర్యంలో క్రైస్తవ మత సాంప్రదాయంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
అమ్మా నాన్నకు ప్రేమతో...
నాగర్‌కర్నూల్ రూరల్: ఇంట్లో నుంచి కుమారులు వెళ్లగొట్టడంతో రోడ్డుపాలైన వృద్ధ దంపతులకు పోలీసులు బాసటగా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మండలం ఉయ్యాలవాడకు చెందిన బుచ్చారెడ్డి, జానకమ్మలు తమ కుమారుల తీరుపై సోమవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విషయం విదితమే. ఈ ఘటనపై స్పందించిన ఎస్ఐ ప్రదీప్‌కుమార్.. దంపతుల కుమారులు నిరంజన్‌రెడ్డి, ఆంజనేయులురెడ్డి, మురళీధర్‌రెడ్డిలను స్టేషన్‌కు పిలిపించారు. వారితో మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిందిపోయి ఇంట్లో నుంచి వెళ్లగొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున రూ.15లక్షలు బ్యాంకులో వారి పేరున జమ చేయాలని ఎస్ఐ సమక్షంలో గ్రామపెద్దలు చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. వారం రోజుల్లో డబ్బును బ్యాంకులో జమచేయాలని సూచించారు. అయితే తల్లిదండ్రులిద్దరూ పెద్దకుమారుడు నిరంజన్‌రెడ్డి ఇంట్లో ఉండేలా ఒప్పందం చేశారు. -
జగనన్నను సీఎంగా చూడాలన్నదే అమ్మ ఆశయం
ఉయ్యాలవాడ, న్యూస్‌లైన్: దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే అమ్మ ఆశయమమని ఆమె పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ అన్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం మండలంలోని ఆర్.పాంపల్లె, కొండుపల్లె, సర్వాయిపల్లె, పెద్దయమ్మనూరు, బోడెమ్మనూరు గ్రామాల్లో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శోభానాగిరెడ్డి భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆమె చూపించిన ప్రేమాభిమానాలు అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి అమ్మకు ఘనమైన నివాళి అర్పించాలని ఓటర్లను కోరారు. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారని, ఆ అభిమానాన్ని ఓట్ల ద్వారా అమ్మకు చూపించాలన్నారు. అమ్మకు వేసే ప్రతి ఓటు దేశంలోనే చారిత్రాత్మకం అవుతుందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. బోడెమ్మనూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ మెంబర్ ఫక్కీరా ఖాసింసాహెబ్ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతోనే తెలుగుదేశం పతనానికి పునాది పడిందన్నారు. సర్వాయిపల్లె గ్రామంలో మాజీ గ్రామ సర్పంచ్ ఆవుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీ తెచ్చి శోభమ్మ ప్రజల హృదయాల్లో నిలిచిందని చాటుతామన్నారు. ప్రచారంలో ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల ఆ పార్టీ మండల కన్వీనర్లు మారంరెడ్డి అయ్యపురెడ్డి, గాండ్ల పుల్లయ్య, కోవెలకుంట్ల మార్కెట్‌యార్డ్ మెంబర్ బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్‌లు రామగోపాల్‌రెడ్డి, కర్రా రాజానందరెడ్డి, బత్తుల రామచంద్రుడు, గడ్డం దస్తగిరిరెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, సింగల్‌విండో ఉపాధ్యక్షుడు మద్దూరు రామకృష్ణారెడ్డి, ఉయ్యాలవాడ సింగల్‌విండో అధ్యక్షుడు బుడ్డా విశ్వనాథరెడ్డి, ఆ పార్టీ నాయకులు బీవీ రామిరెడ్డి, బోరెడ్డి నర్సిరెడ్డి, శింగం వెంకటేశ్వరరెడ్డి, బుడ్డా రామిరెడ్డి, బోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గోపిరెడ్డి హరిప్రసాదరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా మహిళలు పాల్గొన్నారు.