‘ఉయ్యాలవాడ’ కు హీరో శ్రీకాంత్ నివాళి
కోవెలకుంట్ల : తెల్లదొరలపాలిట సింహాస్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ నివాళులర్పించారు. ఓ న్యూస్‌చానల్ ఆ«ధ్వర్యంలో నిర్మిస్తున్న విప్లవ నరసింహారెడ్డి సీరియల్‌లో నటించేందుకు గురువారం హీరో పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని బ్రిటీష్ ట్రెజరీ ప్రాంతంలో ఉన్న నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నరసింహారెడ్డి ట్రెజరీ కొల్లగొట్టిన ప్రాంతం, ఆయనను ఉరి తీసిన జుర్రేరు, బ్రిటీష్‌వారికి నరసింహారెడ్డి పట్టుబడిన జగన్నాథగట్టు ప్రాంతంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినీహీరోకు రాయలసీమ జేఏసీ కో ఆర్డినేటర్ కామని వేణుగోపాల్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి, లైబ్రేరియన్ నరసింహారెడ్డి ఘన స్వాగతం పలికారు.
లొకేషన్ల పరిశీలన
బనగానపల్లె : సినీ హీరో శ్రీకాంత్ పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పార్క్‌ను గురువారం పరిశీలించారు. ఓ న్యూస్‌చానల్ ఆ«ధ్వర్యంలో నరసింహారెడ్డిపై సీరియల్ తెరకెక్కిస్తున్నట్లు హీరో తెలిపారు. త్వరలో సినీ నటుడు చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సినిమా చిత్రీకరించనున్నామని, ఇందుకోసం లోకేషన్లు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి దంపతులు ఉన్నారు.