కుమారులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ ప్రదీప్
నాగర్‌కర్నూల్ రూరల్: ఇంట్లో నుంచి కుమారులు వెళ్లగొట్టడంతో రోడ్డుపాలైన వృద్ధ దంపతులకు పోలీసులు బాసటగా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మండలం ఉయ్యాలవాడకు చెందిన బుచ్చారెడ్డి, జానకమ్మలు తమ కుమారుల తీరుపై సోమవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విషయం విదితమే.
ఈ ఘటనపై స్పందించిన ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్.. దంపతుల కుమారులు నిరంజన్‌రెడ్డి, ఆంజనేయులురెడ్డి, మురళీధర్‌రెడ్డిలను స్టేషన్‌కు పిలిపించారు. వారితో మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిందిపోయి ఇంట్లో నుంచి వెళ్లగొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దీంతో ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున రూ.15లక్షలు బ్యాంకులో వారి పేరున జమ చేయాలని ఎస్‌ఐ సమక్షంలో గ్రామపెద్దలు చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. వారం రోజుల్లో డబ్బును బ్యాంకులో జమచేయాలని సూచించారు. అయితే తల్లిదండ్రులిద్దరూ పెద్దకుమారుడు నిరంజన్‌రెడ్డి ఇంట్లో ఉండేలా ఒప్పందం చేశారు.