అభివృద్ధి ఇన్నింగ్స్ ఆరంభం: సచిన్
* మహిళలు దేశానికి వెన్నెముక.. త్యాగాలు చేసేది మహిళలే
* జన్మనిచ్చిన తల్లికి, పీఆర్ కండ్రిగ తల్లులకూ నా భారతరత్న అంకితం
* మీ పిల్లల్ని దేశానికి తారలుగా తయారు చేయండి
* నేను భారతీయుడ్ని.. అందుకే ఈ గ్రామాన్ని ఎంచుకున్నా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘ఆదర్శ గ్రామం కింద పుట్టంరాజువారికండ్రిగలో అభివృద్ధి అనే మొదటి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అభివృద్ధి నిర్వహణ రెండో ఇన్నింగ్స్ మీ చేతుల్లోనే ఉంది. మహిళలు త్యాగధనులు. భర్తకు, పిల్లలకు తోడపుట్టిన వారికి, గ్రామానికి వారి కష్టాలను త్యాగం చేస్తారు. అందుకే ప్రభుత్వం నాకిచ్చిన భారతరత్నను జన్మనిచ్చిన తల్లికి, మహిళలకు, ఇక్కడున్న తల్లులందరికీ అంకితంచేస్తున్నా. మహిళలు దేశానికి వెన్నెముకలాంటి వారు. మీ పిల్లలను జాగ్రత్తగా పెంచి దేశానికి బ్రహ్మాండమైన తారలుగా తయారుచేయాలి’’ అంటూ క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ రమేష్ టెండూల్కర్ భావోద్వేగ ఉపన్యాసం ఇచ్చారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న ఆయన ఆదివారం గ్రామంలో పర్యటించారు. అక్కడ స్వయం సహాయక గ్రూపు సభ్యులతో ముఖాముఖి మాట్లాడారు. మహిళా గ్రూపుల నిర్వహణ, పొదుపు, బ్యాంక్ లింకేజీ రుణాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వివరించారు.
చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలు, జబ్బులు రావటానికి కారణాలను వివరించారు. చేతులు కడుక్కోకుండానే పిల్లలకు అన్నం పెడుతున్నారని, అందువల్లే జబ్బులొస్తున్నాయని వివరించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారు వాటిని సరిగా వినియోగించుకోవాలని, వాటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో పిల్లలకు తెలియజేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. భగవంతుడు అనుగ్రహిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
పుట్టంరాజువారి కండ్రిగలో రచ్చబండ వద్ద గ్రామస్తులనుద్దేశించి సచిన్ మాట్లాడారు. పుట్టంరాజువారి కండ్రిగను దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తాను భారతీయుడినని, దేశం తరపున క్రికెట్ ఆడగలిగే అవకాశం వచ్చిందని, తాను అన్ని ప్రాంతాలకు చెందిన వాడినని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్నానని, పుట్టంరాజువారి కండ్రిగనే ఎంచుకోవటానికి జాయింట్ కలెక్టర్ రేఖారాణి కారణమని వివరించారు.
మద్యం, పొగాకు తాగబోమని, జూదం అడటం మానేస్తున్నట్లు గ్రామస్తులు ప్రతిజ్ఞ చేసినందుకు సచిన్ హర్షం వ్యక్తంచేశారు. ప్రతిఒక్కరు బాగుండాలంటే మద్యం, పొగాకు తాగటం, జూదం ఆడటం నిలిపేయాలని కోరారు. మద్యం, జూదానికి వెచ్చించే సమయాన్ని భార్య, పిల్లలతో గడిపితే అందరూ సంతోషంగా ఉంటారని సూచించారు. ప్రతిఒక్కరూ చదువుకోవాలని, కుల, మతాలకతీతంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. మూడు నెలల్లో మరోసారి వస్తానని, అప్పటికి గ్రామంలో మార్పులు కనిపించాలని కోరారు.
మహిళలు, గ్రామస్తులతో మాట్లాడే సమయంలో వచ్చీరాని తెలుగులో మాట్లాడారు. ముందుగా ‘మీ అందరికీ నమస్కారం.. నాకు తెలుగు తెలియదు.. ఇంగ్లిష్‌లో మాట్లాడుతాను’ అని చెప్పారు. సచిన్ ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండగా కలెక్టర్ శ్రీధర్ తెలుగులో మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, జేసీ రేఖారాణి, ఏస్పీ సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇది మరచిపోలేని పర్యటన : సచిన్
ముత్తుకూరు: పీఆర్ కండ్రిగ నుంచి ఆయన ఆదివారం మధ్యాహ్నం కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు. పోర్టు అతిథి గృహంలో భోజనం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చెన్నై వెళ్లారు. పోర్టు సీఈఓ అనిల్ ఎండ్లూరి, ఎండీ శశిధర్, ఉన్నతోద్యోగులు, జిల్లా ఉన్నతాధికారులు సచిన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎండీ శశిధర్ సచిన్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ ఇది మరచిపోలేని పర్యటన అని చెప్పారు.