అందరం కలసి అభివృద్ధి చేద్దాం | Will develop Puttamraju Kandriga together | Sakshi
Sakshi News home page

అందరం కలసి అభివృద్ధి చేద్దాం

Published Thu, Nov 17 2016 1:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

అందరం కలసి అభివృద్ధి చేద్దాం - Sakshi

అందరం కలసి అభివృద్ధి చేద్దాం

  • జిల్లా అధికారులతో సచిన్‌ టెండూల్కర్‌
  • సాక్షి ప్రతినిధి, నెల్లూరు :
    పుట్టంరాజువారికండ్రిగను అందరం సమైక్యంగా ముందుకు పోయి అభివృద్ధి చేద్దామని రాజ్యసభ సభ్యుడు, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌  పేర్కొన్నారు. గూడూరు సమీపంలోని పుట్టంరాజువారికండ్రిగలో రూ.115.24 లక్షలతో నిర్మించిన సామాజిక వికాసభవనాన్ని బుధవారం సచిన్‌ ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకోసం పుట్టంరాజుకండ్రిగను అన్ని విధాలా తీర్చిదిద్దడం జరుగుతుందనన్నారు. క్రికెట్‌ ఆటలో విజయం సాధించాలన్నా సమైక్యంగా విజయం సాధించడం అవసరమన్నారు. అలాగే  జిల్లా యంత్రాంగం సమైక్య కృషితో పుట్టంరాజువారికండ్రిగను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. నాయకత్వాలు మారినా అభివృద్ధికి ఆటంకం ఉండదన్నారు. గతంలో తాను పుట్టంరాజువారికండ్రిగకు వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయని, గ్రామం రూపురేఖలు మారాయన్నారు. గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల పాత్ర అభినందనీయమన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా పుట్టంరాజువారికండ్రిగను సచిన్‌ ఈ సందర్బంగా  ప్రకటించారు. మరికొన్ని సౌకర్యాలు కల్పించి  గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్తులు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం  కొత్త అధ్యయనం మొదలైందని, భావితరాల వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ముత్యాలరాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    రెండో విడత అభివృద్ధికి రూ.3.05 కోట్లు
    క్రికెట్‌ దిగ్గజం, రాజ్య సభ్యుడు సచిన్‌టెండూల్కర్‌ దత్తత పంచాయతీలో మిగిలిన రెండు గ్రామాల అభివృద్ధికి కూడా రూ.3.05 కోట్లతో త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. గూడూరు రూరల్‌ పరిధిలోని పుట్టమరాజువారి కండ్రిగ గ్రామంలో మంగళవారం సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌ గంటన్నరపాటు పర్యటించారు.  చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళవారం ఉదయం 11.45 నిమిషాలకు పుట్టమరాజువారికండ్రిగ గ్రామ సమీపంలో ఉన్న చెమిర్తి పొలాల వద్ద ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన దత్తత గ్రామంలో రూ.115.24 లక్షలతో నిర్మితమైన కమ్యూనిటీ భవనం వద్దకు 12 గంటలకు చేరుకున్నారు. ¿¶ వన ప్రారంభోత్సవం అనంతరం అధికారులతో కొంత సేపు సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి దత్తత తీసుకున్న గ్రామానికొచ్చినప్పుడు  గోపాలయ్య, విజయమ్మల ఇంటి వద్దకు వచ్చి వారిని పలకరించారు. ఈ మేరకు ఈ దఫా కూడా వారి నివాసమైన పింక్‌ హౌస్‌ వద్దకు చేరుకుని, ఆ కుటుంబ సభ్యులతోనూ, గ్రామస్తులతోనూ 15 నిమిషాలపాటు ముచ్చటించారు. అక్కడ నుంచి పాఠశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభాస్థలికి 12.45 గంటలకు చేరుకుని కేవలం నాలుగు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.
    రెండో విడతలో గొల్లపల్లి, నెర్నూరుల అభివృద్ది
    కలెక్టర్‌ ముత్యాలరాజు, జేసీ ఇంతియాజ్‌లు మాట్లాడుతూ పీఆర్‌ కండ్రిగను మొదటి విడతగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రెండో విడతగా నెర్నూరు పంచాయతీలోని   గొల్లపల్లి, నెర్నూరులో రూ.3.05 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని, వాటితో మూడు నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
    ఈ రోజు మరువలేనిది.. 
    మా దేవుడు సచిన్‌ టెండుల్కర్‌ తమ గ్రామానికి రావడం మరువలేనిరోజు, వెలకట్టలేనిదని పంచాయతీ సర్పంచ్‌ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ తమ పంచాయతీలోని ఒక్క గ్రామమే అభివృద్ధి చెందిందని, మళ్లీ సచిన్‌ రాకతో మిగిలిన రెండు గ్రామాలు కూడా అభివృద్ధి చెందనున్నాయన్నారు. తమ గ్రామం ఇలా అభివృద్ధి చెందడం వెనకు అప్పటి కలెక్టర్‌ శ్రీకాంత్‌, జేసీ రేఖారాణి పాత్ర ఎంతైనా ఉందని, వారిద్దరినీ గ్రామస్తులందరూ గుర్తు చేసుకోవాలన్నారు. 
     
    ఈ అభివృద్ధి జరగాలంటే 50 ఏళ్లు పట్టి ఉండేది 
    తమ గ్రామం ఈ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే 50 నుంచి వందేళ్లు పట్టుండేదని పింక్‌ హౌస్‌ దంపతుల కుమారుడైన మహేష్‌ ఆనందం వ్యక్తం చేశారు. కలలో కూడా జరగని అభివృద్ధిని తమ  గ్రామానికి చేసి అందరి గుండెల్లో సచిన్‌ గుడికట్టుకుని పూజిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. 
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement