ఒక ప్రయాణం... గ్రామాన్నే మార్చేసింది! | On a journey to change the village | Sakshi
Sakshi News home page

ఒక ప్రయాణం... గ్రామాన్నే మార్చేసింది!

Published Tue, Nov 18 2014 11:39 PM | Last Updated on Sat, Oct 20 2018 6:07 PM

ఒక ప్రయాణం... గ్రామాన్నే మార్చేసింది! - Sakshi

ఒక ప్రయాణం... గ్రామాన్నే మార్చేసింది!

ఎక్కడి పుట్టంరాజువారి కండ్రిగ- ఎక్కడి సచిన్ టెండుల్కర్?
సచిన్ బ్యాటు విసిరితే బంతి బౌండరీ దాటినట్లు...
ప్రధాని సూచనతో దక్షిణాదిలో తూర్పుకనుమల దరికి చేరాడు.
అందుకు సంధానకర్త నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి.
క్రికెట్ పట్టని ఆమెకి అభివృద్ధి అంటే మక్కువ... అంకితభావం అంటే గౌరవం.


సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన... ప్రధాని నరేంద్రమోదీ మెదడులో మెరిసిన ఓ ఆలోచన. పార్లమెంటు సభ్యులందరూ తమ నియోజక వర్గంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని దానిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఓ ప్రయత్నం మొదలైంది. లోక్‌సభ సభ్యులకు కచ్చితమైన భౌగోళిక పరిధి ఉంటుంది. కానీ రాజ్యసభ సభ్యుల పరిధి విస్తృతమైనది. దేశంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ ఓ తెలుగు రాష్ట్రానికి ఇచ్చాడు. అందుకు సంధానకర్తగా వ్యవహరించిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి మీద అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.
 
రైల్లోనో, బస్సులోనో, విమానంలోనో ప్రయాణించేటప్పుడు ఎంతోమంది సహప్రయాణికులు ఉంటారు. సచిన్ వంటి ప్రముఖ క్రీడాకారుడు ప్రయాణిస్తుంటే ఆటోగ్రాఫులు, ఫొటోగ్రాఫులు సరేసరి. ఆ రోజు సచిన్‌తో సాగిన విమానయానంలో రేఖారాణి ఇతర ప్రయాణికులు స్పందించినట్లు స్పందించలేదు. అతడిలో రాజ్యసభ సభ్యుడిని చూశారామె. ప్రధానమంత్రి రూపొందించిన పథకాన్ని అమలు చేయడానికి అనువైన ప్రదేశాలను ఎంపిక చేసే కీలకమైన విధులు నిర్వర్తించే రేఖారాణికి ఒక్కసారిగా మారుమూల గ్రామాలు కళ్లముందు కదిలాయి. ‘దత్తత తీసుకోవాల్సిన కుగ్రామం కోసం మీరు కసరత్తు చేయనక్కరలేదు... మా జిల్లాలో అలాంటివి ఎన్నో ఉన్నాయం’టూ... ఆదర్శ గ్రామంలో ఉండాల్సిన మౌలిక వసతుల వివరాలను సచిన్‌కు తెలియచేశారు.

ఆ నిమిషంలో అందుబాటులో ఉన్న టిస్యూ పేపర్ మీద కొన్ని ప్రాథమికాంశాలను రాసిచ్చారు. అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయలేదామె. సచిన్ టెండుల్కర్ ఈ-మెయిల్ ఐడి తీసుకున్నారు, తన మెయిల్ ఐడి సచిన్‌కిచ్చారు. అప్పటి నుంచి ఈ-మెయిల్ ద్వారా ఆదర్శ గ్రామం స్వరూప స్వభావాలను ఆయనకు వివరించారు. అలా నెల్లూరు జిల్లాలో గూడూరు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామం ఎంపికైంది. ఇటీవల సచిన్ పర్యటనతో ఆ గ్రామం ఒక్కసారిగా జాతీయ వార్తల్లో చేరింది. అభివృద్ధి కార్యక్రమాలు చకాచకా సాగిపోతున్నాయి.
 
సామాజిక బాధ్యతగా...
రేఖారాణి స్వతహాగానే జాయింట్ కలెక్టర్‌గా కర్తవ్య నిర్వహణలో సామాజిక బాధ్యతలను నిర్వర్తించే అధికారి. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారామె. అత్యధిక శాతం పోలింగ్ జరిగిన కేంద్రాలను ఎంపిక చేసి అందులో లాటరీ ద్వారా ఒక ఓటరుకు ఒక గ్రాము బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైన మొదటి వంద కేంద్రాల్లో ఒక్కో కేంద్రం నుంచి ఒక్కో లక్కీ ఓటరును డిప్ తీసి బంగారం బహుమతిగా ఇచ్చారు.
 
పెన్నా తీరంలో... గోదావరమ్మాయి!

ప్రజలను చైతన్యవంతం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి ఇంతగా తాపత్రయ పడే రేఖారాణిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. పెరిగింది హైదరాబాద్‌లో. భర్త పరదేశీ నాయుడు ఐపిఎస్ అధికారి. ఆయన 1987లో మావోయిస్టులు పెట్టిన మందు పాతర పేలి మరణించారు. అప్పటికే గ్రూప్ వన్ పరీక్షలో సెలెక్ట్ అయి ఉన్న రేఖారాణి... భర్త మరణానంతరం జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. పనితీరులో ఆమె చూపిస్తున్న చొరవకు నెల కిందట ఐఎఎస్ హోదా లభించింది.
 
క్రికెట్ పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని రేఖారాణికి సచిన్‌తో పరిచయం కేవలం యాదృచ్ఛికమే. రేఖారాణి కుమారుడు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగపరంగా శిక్షణ కోసం అమెరికాకు వెళ్లారాయన. శిక్షణ పూర్తయిన తర్వాత కొడుకుతోపాటు రేఖారాణి ఇండియాకి వస్తున్న సమయంలో విమానంలో సచిన్ తారసపడ్డారు. విమానంలో మాట్లాడినప్పుడు, ఆ తర్వాత ఈ-మెయిల్‌లో సంప్రదించిన తర్వాత సచిన్ గురించి రేఖారాణి చెప్పేది ఒక్కటే. ‘‘సచిన్‌లో అంకితభావం ఎక్కువ, ఆయన గొప్ప కర్తవ్య నిర్వహకుడు’’ అంటారామె.

నూటపది గడపలతో వెనుకబడిన వర్గాలున్న పుట్టంరాజు వారి కండ్రిగను దత్తత తీసుకోవడం ద్వారా సచిన్ ఆ మాటకు నిదర్శనంగా నిలుస్తున్నారు. సచిన్ దృష్టిని ఇటువైపు పడేలా ఆమె చేసిన ప్రయత్నం సమాజంలో మార్పుకు నిబద్ధత గల అధికారులు ఏ మేరకు సాయం చేయగలరో చూపింది. స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొంటున్న ప్రముఖులకు, ఎంపీలకూ సేవ చేయడానికి, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉత్సాహాన్నిచ్చింది.
     - సాక్షి, నెల్లూరు.  ఫొటోలు: ఆవుల కమలాకర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement