పండుగలా దిగివచ్చాడు.. | Festival atmosphere in Puttamraju Vari Kandrika with Sachin Tendulkar arrival | Sakshi
Sakshi News home page

పండుగలా దిగివచ్చాడు..

Published Mon, Nov 17 2014 12:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

పండుగలా దిగివచ్చాడు.. - Sakshi

పండుగలా దిగివచ్చాడు..

* పీఆర్ కండ్రిగను సందర్శించిన సచిన్
* క్రికెట్ దిగ్గజం రాకతో పులకించిన గ్రామస్తులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పుట్టంరాజువారి కండ్రిగ ఆదివారం పండగ చేసుకుంది. సంక్రాంతి, దసరా, ఉగాది.. అన్ని పండగలూ ఒకేసారి వచ్చాయా అన్నట్లుగా గ్రామస్తులంతా పండగ చేసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున క్రికెట్ దేవుడు సచిన్ రావాడంతో గ్రామస్తులంతా పండగ చేసుకున్నారు. గ్రామస్తులంతా కొత్త దుస్తులు ధరించారు. ఇళ్ల ముందు పుష్పాలతో ముగ్గులు వేసి సచిన్‌కు స్వాగతం పలికారు. దూరాన ఉన్న పిల్లలు, బంధువులందరినీ పిలిపించుకుని క్రికెట్ దిగ్గజాన్ని చూపించారు. ఇప్పటివరకు బ్యాట్‌తో ప్రత్యర్థులను ఆటాడుకుంటుంటే టీవీల్లో మాత్రమే చూడగలిగే అభిమాన క్రీడాకారుడు నేరుగా కళ్ల ముందే నిలవడంతో పల్లె జనం పులకించిపోయారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టంరాజువారి కండ్రిగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు భారతరత్న, రాజస్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఆదివారం ఉదయం 9.08 గంటలకు కృష్ణపట్నం పోర్టు నుంచి గ్రామానికి వచ్చారు. ఉదయం 11.05 గంటల వరకు రెండు గంటల పాటు గ్రామంలో బిజీబిజీగా గడిపారు. కాలి నడకన గ్రామమంతా కలియదిరిగారు. గ్రామస్తులందరినీ పలకరించారు. వారి ఇళ్లలోకి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం డ్వాక్రా మహిళలు, గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు చేశారు. ఎంపీ లాడ్స్ నిధులు రూ. 2.79 కోట్లతో గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన పైలాన్‌ను గ్రామానికి చెందిన ఓ చిన్నారి చేత ప్రారంభించారు.

అనంతరం కంపోస్ట్ షెడ్, 13 ఎకరాల చెరువు అభివృద్ధికి సచిన్ శంకుస్థాపన చేశారు. చెరువులో చేప పిల్లలను వదిలారు. అదే చెరువులో పిల్లల కోసం బోటింగ్ స్పాట్, గ్రామంలో కమ్యూనిటీ హాల్, వెయిటింగ్ హాల్, ఫుట్‌పాత్, సీసీ ైటె ల్స్, అంగన్‌వాడీ పాఠశాల, వంట గది, వేదిక, పాఠశాల ప్రహరీ తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఎకరం స్థలంలో క్రికెట్ పిచ్‌తో పాటు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను పరిశీలించారు. ఎంపీ నిధులతోనే శ్మశాన వాటిక, అక్కడ మరుగుదొడ్లు, ప్రహరీ, రోడ్డు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో పశుసంవర్థక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. అక్కడ గోవుకు పూలమాల వేసి పూజ చేశారు. స్టాల్‌లో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు. గోవులు, గేదెలను పరిశీలించారు. అంగన్‌వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాలను పరిశీలించి, వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ గర్భిణులకు సీమంతం చేశారు. గిరిజన మహిళ వెంకట రమణమ్మ, ఎస్సీ మహిళ సుమతికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్ ఇచ్చి అక్షితలు చల్లి ఆశీర్వదించారు. మంత్రి నారాయణ, కలెక్టర్ శ్రీధర్ గ్రామస్తులకు, సచిన్‌కు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించారు. సచిన్ చెప్పిన విషయాలను గ్రామస్తులకు వివరించి, గ్రామస్తులు చెప్పిన వాటిని సచిన్‌కు తర్జుమా చేసి చెప్పారు.

సచిన్‌కు గ్రామస్తుల కానుక
తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్‌కు గ్రామస్తులు ఓ అద్భుత కానుక ఇచ్చారు. మద్యం, సిగరేట్ అలవాటు ఉన్న పురుషులు వాటిని మానేస్తున్నట్లు ఆయన ముందు ప్రతిజ్ఞ చేశారు. ఆ మేరకు గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ప్రకటించిన వెంటనే గ్రామస్తులు పొగాకు, మద్యం, జూదం మానేసి దేశంలోనే ఆదర్శంగా బతుకుతామని హామీ ఇచ్చారు.

గ్రామస్తుల నిరాశ
అధికారుల సమన్వయ లోపం కారణంగా సచిన్ టెండుల్కర్ గ్రామానికి వచ్చిన ఆనందం ఆ గ్రామస్తులకు లేకుండా పోయింది. ముఖాముఖి కార్యక్రమం రద్దుకావడంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. డ్వాక్రా మహిళలతో మాట్లాడిన అనంతరం సచిన్ గ్రామస్తులతో సుమారు గంట పాటు ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం రచ్చబండ వద్ద వేదిక ఏర్పాటు చేశారు. అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు, ప్రజలు, జిల్లా అధికారులు, వారి బంధుగణం, అధికార పార్టీ నేతలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ముఖాముఖి కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు మాత్రమే ఉండాలని పలుమార్లు చెప్పినా ఎవరూ అక్కడ నుంచి కదలలేదు. సచిన్ రాగానే అభిమానులు వేదిక చుట్టూ చేరిపోయారు. పోలీసులు వీరిని అదుపు చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. పలువురు కుర్చీలపై నిల్చోవడంతో సచిన్‌ను చూసే అవకాశం గ్రామస్తులకు లేకపోయింది. ఒక సమయంలో పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. కుర్చీలు కూడా విరిగిపోయాయి. దీంతో ముఖాముఖి కార్యక్రమాన్ని రద్దు చేశారు.

గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించిన సచిన్ రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక దశలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచిన్‌ను కలిసేందుకు వచ్చిన కొందరు అంధులు, క్రికెట్ ఆడతారని భావించిన  గ్రామస్తులు, జ్ఞాపికలు ఇచ్చేందుకు వచ్చిన అభిమానులు ఏదీ సాధ్యం కాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.

గ్రామస్తుల స్థితిగతులపై ఆరా
తాను దత్తత తీసుకున్న గ్రామస్తుల స్థితిగతులపై సచిన్ ఆరా తీశారు. నిరుపేదలు నివసిస్తున్న పూరి పాకల్లోకి వెళ్లి వారితో ముచ్చటించారు. కష్టసుఖాలు తెలుసుకున్నారు. బీజీ కాలనీలో కోకోలు గోపాలయ్య, విజయమ్మ దంపతులు, కోకోలు పెంచలయ్య, రత్న మ్మ దంపతులను పలకరించారు. వారి సంభాషణ..

అప్పు చేసి కొడుకును చదివించా: కోకోలు గోపాలయ్య, విజయమ్మ దంపతులు

సచిన్: పిల్లలు ఎంత మంది?
దంపతులు: ఇద్దరు. అమ్మాయి, అబ్బాయి.
సచిన్: వారు ఏం చేస్తున్నారు?
దంపతులు: అమ్మాయికి పెళ్లి చేశాం. అబ్బాయిని ఎంబీఏ చదివించాం.
సచిన్: చదువుకు డబ్బు ఎలా సమకూర్చారు?
దంపతులు: అప్పు చేసి చదివించాం.
సచిన్: అప్పు ఏ విధంగా తీరుస్తారు?
దంపతులు: అబ్బాయికి ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాం. ఉద్యోగ విషయంలో మీరే సహాయం చేయాలి..
సచిన్ : తప్పకుండా సహాయం చేస్తా.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతున్నాం:  కోకోలు పెంచలయ్య, రత్నమ్మ
సచిన్: పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారా?
దంపతులు: బాగానే ఉంచుకుంటున్నామయ్యా.
సచిన్: టాయ్‌లెట్స్ సౌకర్యంగానే ఉన్నాయా?
దంపతులు: సౌకర్యంగా ఉన్నాయి.
సచిన్: పిల్లలు ఏం చేస్తున్నారు?
దంపతులు: కూతురు ఇంటర్, కుమారుడు 9 చదువుతున్నారు.
సచిన్: తాగునీరు కుళాయిల్లో వస్తుందా?
దంపతులు: రోజూ వస్తుంది.
సచిన్: మీ ఊరికి మురుగు కాలువలు, ఇళ్లు, రోడ్డు సౌకర్యాలు క ల్పిస్తున్నాం. శుభ్రంగా ఉంచుకుంటారా?
దంపతులు : అందరూ శుభ్రంగా ఉంచుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement