ఏలూరు :అభివృద్ధి పనులు చేద్దామంటే నిధులు లేవు. పథకాలను అమలు చేద్దామన్నా అదే పరిస్థితి. అయినా వివిధ పథకాల అమలు తీరు, లక్ష్యసాధన తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించడం విమర్శల పాలవుతోంది. నిరంతర సమీక్షలతో కలెక్టర్ మొదలుకుని.. దిగువస్థాయి ఉద్యోగుల వరకు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తికావస్తున్నా నిధులు విడుదల కావటం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాల యాల్లో పనులేవీ చేయలేని పరిస్థితి నెలకొంది. వారంలో ఐదు రోజులపాటు కలెక్టరేట్‌లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరయ్యే అధికారులకు గంటల తరబడి రాకపోకలకే సమ యం సరిపోతోంది. ఫలితంగా కార్యాలయాల్లో నిర్వహించాల్సిన చిన్నపాటి పనులు కూడా ముందుకు సాగటం లేదు. నిరంతరం ఓ పక్క కలెక్టరేట్‌లో సమీక్షలు నిర్వహిస్తుంటే.. మరోవైపు హైదరాబాద్ లేదా విజయవాడలో నిర్వహించే సమీక్షలకు హాజరు కావాలంటూ ఆదేశాలు వస్తున్నాయి.
దీంతోపాటు హైదరాబాద్‌లో సమీక్షలంటూ నివేదికలు తీసుకు రమ్మంటున్నారు. రోజుకో రూపంలో రోజుకో విధంగా నివేదికలు ఇవ్వాల్సి వస్తోందని దిగువస్థాయి అధికారులు వాపోతున్నారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్లడం అదనం. ఇలా నిధుల్లేని పాలనలో అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. జిల్లాలో ఏ అధికారిని పలకరించినా ‘ఎందుకొచ్చిన సమీక్షలండీ’ అని పెదవి విరుస్తున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు వత్తిడి పెరిగిపోతోందని, ఎన్ని నివేదికలు పంపుతున్నా నిధులు రావడం లేదని వాపోతున్నారు. కార్యాలయంలో కూర్చుని పనులు చక్కబెట్టుకోలేకపోతున్నామని, ప్రస్తుత సర్కారు పాలనలో ఎప్పుడూ లేని వింత పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన చెందుతున్నారు. వారంలో ఐదు రోజులపాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నామని, సమాచారాన్ని దిగువస్థాయికి చేరవేయలేకపోతున్నామని ఓ మునిసిపల్ కమిషనర్ వ్యాఖ్యానించారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు.
నిధులు నిల్..సమీక్షలు ఫుల్
Published Tue, Mar 3 2015 1:18 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
Advertisement
Advertisement