Funds nil
-
పైసా నిల్ !
- నిధుల్లేకుండా ‘పశుశాఖ’ పయనం – చెత్త బుట్టలోకి రూ.కోట్ల ప్రతిపాదనలు – ప్రత్యామ్నాయం కరువై అన్నదాతల అవస్థలు అనంతపురం అగ్రికల్చర్: పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్న చందంగా... పైసా బడ్జెట్ లేకుండా పశుసంవర్ధకశాఖ పయనం సాగిస్తోంది.పశుగ్రాసం పథకం మినహా మిగతావన్నీ పూర్తిగా పడకేశాయి. పశుక్రాంతి, జీవక్రాంతి లాంటి ప్రయోజనం కల్పించే పథకాలకు ఎప్పుడో మంగళం పాడేశారు. జిల్లా అధికారులు కసరత్తు చేసి రూ.కోట్ల బడ్జెట్‌తో తయారు చేసి పంపుతున్న ప్రతిపాదనలు, నివేదికలను చంద్రబాబు సర్కారు చెత్తబుట్టలో పడేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వ్యవసాయానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పాడిపరిశ్రమ చతికిలపడింది. కలగానే ప్రత్యామ్నాయం జిల్లాలో 9.80 లక్షల సంఖ్యలో పశుసంపద, 45 లక్షల సంఖ్యలో గొర్రెలు, మేకలు, 18 లక్షలు కోళ్లు, మరో 50 వేలు ఇతరత్రా జంతువులు ఉన్నాయి. పాడిని నమ్ముకుని 2.50 లక్షల కుటుంబాలు, జీవాలపై 48 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా కేంద్ర బృందాలు జిల్లాకు వచ్చి కరువును కళ్లారా చూసి చలించడం మినహా అభివృద్ధి బాట పట్టించే కార్యక్రమాలు చేపట్టని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాల్సిన పాలకులు పట్టించుకోవడం మానేయడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయం అనేది పగటి కలగానే మిగిలిపోయింది. పడకేసిన పాడి వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతులు, మహిళలకు పెద్ద పీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా పశుసంవర్ధకశాఖకు కేటాయిస్తున్న బడ్జెట్, అమలు చేస్తున్న పథకాలు చూస్తే అందుకు విరుద్ధంగా ఉండటం విశేషం. చెప్పుకునేందుకు ఒక్క పథకం కూడా లేదంటే ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. పశుక్రాంతి లాంటి ప్రతిష్టాత్మకమైన పథకానికి ఫుల్స్టాప్ పెట్టగా.... మినీడెయిరీ లాంటి పథకానికి మంగళం పాడేశారు. జీవక్రాంతి ఊసేలేకపోగా... పశుబీమా అసలేలేదు. పెరటికోళ్లు, పెయ్యదూడలు లేవు. జీవరక్షనిధి, భేడ్పాలక్ లాంటి బీమా పథకాలు ఆపేశారు. పశువైద్యానికి చాలినంత మందులు లేవు. వైద్యం చేయడానికి పూర్తీ స్థాయిలో డాక్టర్లు, కాంపౌండర్లు కరువయ్యారు. ఉన్నవారు కూడా అనవసరమైన నివేదికల తయారీ, మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఊరూరా పశుగ్రాస క్షేత్రం అంటూ అసలైన విధులను పాక్షికంగా నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. జేడీ నుంచి డీడీ, ఏడీ లాంటి పైస్థాయి నుంచి దిగువ స్థాయి వరకు సుమారు 500 మందితో కూడిన పశుశాఖ వ్యవస్థకు ప్రతిపాదనలు తయారు చేయడం, నివేదికలు రూపొందించడం, వారంలో రెండు మూడు రోజులు మీటింగ్, టెలీకాన్ఫరెన్స్, వీడియోకాన్ఫరెన్స్, ఇతరత్రా సమీక్షలకు హాజరవడం లాంటి వృథా ప్రయాస తప్ప చేతినిండా అసలైన పనిలేకుండా పోయింది. ప్రయోజనం లేని క్షీరసాగర, అజొల్లా, హైడ్రోఫోనిక్ లాంటి పేరు తెలియని చిన్నపాటి పథకాలను అమలులోకి తెచ్చారు. సైలేజ్బేల్స్, దాణా పంపిణీ, ట్యాంక్బెడ్ కల్టివేషన్, ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అనే గడ్డి పథకాలు మినహా మరేవీలేవంటే ఆశ్చర్యమేస్తుంది. మూడు నెలలకోసారి జిల్లా అధికారులు కష్టపడి తయారు చేసిన రూ.కోట్ల ప్రతిపాదనలు, నివేదికలు ప్రభుత్వానికి పంపడం, అవి బుట్టదాఖలు అవుతుండటంతో పశుశాఖ పథకాలు మొక్కుబడిగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి. -
నిధులున్నా...కరుణ లేదు!
- ఎస్ఎస్ఏ ఉద్యోగుల జీతాలకు నెలకిందటే విడుదలైన బడ్జెట్ - నాన్నెళ్లుగా వేతనాలందక అల్లాడుతున్న ఉద్యోగులు - కుటుంబపోషణ భారమై అవస్థలు - కలెక్టర్ ఆమోదం కోసం ఎదురుచూపు అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్ఎస్ఏ (సర్వశిక్ష అభియాన్) కాంట్రాక్టు ఉద్యోగులకు నెల కిందట వేతనాల కోసం నిధులు విడుదలైనా అధికారులు కరుణ చూపలేదు. బడ్జెట్ రాలేదని జీతాలు పెండింగ్ పెడితే.. నిధులు పుష్కలంగా ఉన్న జీతాలు చెల్లించలేదు. కలెక్టర్ ఆమోదం కోసం నెల కిందట ఫైలు వెళ్లినా నేటికీ పరిష్కారం చూపలేదు. నాలుగు నెలలుగా జీతాలు అందక.. కుటుంబం గడవక ఉద్యోగులు అల్లాడుతున్నారు. అంతంతమాత్రమే వేతనాలు.. అదికూడా సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు. జిల్లా ఎస్ఎస్ఏ పరిధిలో 63 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 63 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 357 మంది సీఆర్పీలు, 63 మంది మెసెంజర్లు, 378 మంది పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు, 126 మంది ఐఈఆర్టీలు, 12 మంది డీఎల్ఎంటీలు, 756 మంది కేజీబీవీల్లో సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇస్తున్నది కూడా అరకొర వేతనాలు. ఒక్కొక్కరికి నెలకు రూ.8 వేల నుంచి రూ.14వేలోపే అందుతోంది. నాన్నెళ్లుగా జీతాల్లేవ్ : కేజీబీవీల్లో పని చేస్తున్న ఎస్ఓలు, సీఆర్టీలు, నాన్‌టీచింగ్ సిబ్బందికి ఫిబ్రవరి నుంచి, ఎమ్మార్సీ ఉద్యోగులకు మార్చి నుంచి వేతనాలు పెండింగ్ ఉండేవి. గతనెలలో బడ్జెట్ రావడంతో అందరి ఉద్యోగులకు మార్చి వరకు జీతాలు చెల్లించారు. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో జీతాలు చెల్లించేందుకు కలెక్టర్ ఆమోదం కోసం ఫైలు పంపారు. మరోవైపు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. కుటుంబ గడవక ఉద్యోగుల అవస్థలు : గతంలో క్రమం తప్పకుండా ప్రతినెలా జీతాలు మంజూరు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలల తరబడి జీతాలు పెండింగ్ పెడుతున్నారు. వస్తున్న జీతాలు అంతంతమాత్రమేనని, అవికూడా సక్రమంగా ఇవ్వకపోతే ఎలా? అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం తిరగాల్సి ఉంటుందని, నెలంతా పని చేసి జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. అప్పులు కూడా పుట్టడం లేదని వాపోతున్నారు. ఇదిలాఉండగా జీతాల చెల్లించేందుకు ఎస్ఎస్ఏలో బడ్జెట్ పుష్కలంగా ఉంది. గతనెలలో రూ. 6.06 కోట్లు బడ్జెట్ వచ్చింది. ఆ తర్వాత రూ.24 కోట్లు విడుదల చేశారు. మొత్తం రూ.30 కోట్లకు పైగా బడ్జెట్ ఉంది. కలెక్టర్ నుంచి ఆమోదం రాగానే చెల్లిస్తాం కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాన్నెళ్లుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. బడ్జెట్ పుష్కలంగా ఉంది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో జీతాల చెల్లింపునకు కలెక్టర్ ఆమోదానికి పంపాం. అక్కడ కాస్త ఆలస్యమైంది. ఆమోద ముద్ర వేయగానే జూలై వరకు బకాయి జీతాలన్నీ ఒకేమారు చెల్లిస్తాం. – సుబ్రమణ్యం, పీఓ ఎస్ఎస్ఏ -
పనులు ఫుల్.. నిధులు నిల్..
నత్తనడకన సీఎం క్యాంపు కార్యాలయ పనులు నిధులు మంజూరు చేయని ఆర్థికశాఖ ప్రారంభోత్సవంతోనే సరి విజయవాడ: సీఎం క్యాంపు కార్యాలయ మరమ్మతులకు నిధుల గ్రహణం పట్టింది. ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఆర్భాటంగా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించినా.. రావాల్సిన బిల్లులు రాకపోవడంతో పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. రూ.కోటి బిల్లులు బకాయి నగరంలోని నీటి పారుదలశాఖ కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని నిర్ణయించడంతో పాత భవనాన్ని పూర్తిగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్యాకేజీలో భాగంగా పటేల్ ఇంజినీరింగ్ కంపెనీ ఇందుకు ముందుకు వచ్చింది. అయితే, మరమ్మతులకు ఆ సంస్థను పక్కన పెట్టిన కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఏ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి మరమ్మతులు చేయించిన రవి అనే కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు వేగవంతంగా చేయమని ఆదేశించారు. తొలివిడత సుమారు రూ.5కోట్లు ఖర్చవుతుందని నిర్ణయించారు. కాంట్రాక్టర్ కోటి రూపాయలు ఖర్చుచేసి పనులు చేశారు. ఈ పనులకు బిల్లులను ఇక్కడి ఇరిగేషన్ అధికారులు ఆమోదించి హైదరాబాద్‌కు పంపగా, అక్కడ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆమోదించి రాష్ట్ర ఆర్థికశాఖకు పంపినట్లు సమాచారం. అయితే, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ ఈ బిల్లులను ఆమోదించకుండా పక్కన పెట్టారని తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉండటంతో బిల్లులు మంజూరుకాలేదని తెలిసింది. ఈ బిల్లులు మంజూరు చేయాలంటూ కలెక్టర్ బాబు.ఏ లేఖలు రాసినప్పటికీ ఆర్థికశాఖ నుంచి స్పందన రాలేదు. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం మరమ్మతుల బిల్లుల్నే మంజూరు చేయకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రెండు గదులతో ప్రారంభం వాస్తవంగా ఈనెల 2వ తేదీన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఆ తరువాత 6వ తేదీ.. 8వ తేదీ.. అంటూవాయిదా వేశారు. 8వ తేదీన కూడా కేవలం సీఎం కూర్చునే గది, దాని వెనుకవైపు మరో గదిని మాత్రమే అధికారులు సిద్ధంచేసి సీఎంతో ప్రారంభింపజేశారు. సీఎం క్యాంపు కార్యాలయం పూర్తయితే ఏవిధంగా ఉంటుందో ఊహాచిత్రాలను ప్రదర్శించారు. క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం అయిపోవడంతో అధికారులు, కాంట్రాక్టర్ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు సీఎం కాన్ఫరెన్స్ రూమ్, సిబ్బంది కూర్చునే గదులు, ఆయన సెక్రటరీకి స్పెషల్ రూమ్, లిప్టు, డ్రెయినేజీ, విద్యుద్దీపాల అలంకరణ.. ఇలా అనేక పనులు చేయాల్సి ఉంది. అయితే, బిల్లులు మంజూరు కాకుండా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి కాంట్రాక్టర్ సుముఖంగా లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే తరహాలో సాగితే మరో ఆరు నెలలకు కూడా క్యాంపు కార్యాలయం అందుబాటులోకి రాకపోవచ్చు. ఈఈల చేతులు మారి.. వాస్తవంగా నీటిపారుదల ప్రాంగణం మొత్తానికి కేసీ డివిజన్ ఈఈ రవికుమార్ ఇన్చార్జిగా ఉంటారు. ప్రాంగణంలో ఏ నూతన నిర్మాణాలు చేపట్టాలన్నా, మరమ్మతులు చేయాలన్నా ఆయన అనుమతులే తీసుకోవాలి. సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి అయిన కొన్ని బిల్లుల్ని ఆయనే మంజూరు చేశారు. ఆ తరువాత బిల్డింగ్‌లో జరుగుతున్న అనేక మార్పులు చేర్పులు ఆయన దృష్టికి రాకుండానే జరిగిపోయాయి. దీంతో ఆయన బిల్లులపై సంతకాలు పెట్టడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో క్యాంపు కార్యాలయ పనుల వరకు ఈఈ రవికి బదులుగా కేఈ డివిజన్ ఈఈ సత్యనారాయణకు ఎస్ఈ రామకృష్ణ బాధ్యతలు అప్పగించారు. సత్యనారాయణ కూడా ఆచీతూచి అడుగులు వేస్తూ, బిల్లుల గోల తన మెడకు చుట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. -
నిధులు నిల్..సమీక్షలు ఫుల్
ఏలూరు :అభివృద్ధి పనులు చేద్దామంటే నిధులు లేవు. పథకాలను అమలు చేద్దామన్నా అదే పరిస్థితి. అయినా వివిధ పథకాల అమలు తీరు, లక్ష్యసాధన తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించడం విమర్శల పాలవుతోంది. నిరంతర సమీక్షలతో కలెక్టర్ మొదలుకుని.. దిగువస్థాయి ఉద్యోగుల వరకు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తికావస్తున్నా నిధులు విడుదల కావటం లేదు. దీంతో ప్రభుత్వ కార్యాల యాల్లో పనులేవీ చేయలేని పరిస్థితి నెలకొంది. వారంలో ఐదు రోజులపాటు కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరయ్యే అధికారులకు గంటల తరబడి రాకపోకలకే సమ యం సరిపోతోంది. ఫలితంగా కార్యాలయాల్లో నిర్వహించాల్సిన చిన్నపాటి పనులు కూడా ముందుకు సాగటం లేదు. నిరంతరం ఓ పక్క కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహిస్తుంటే.. మరోవైపు హైదరాబాద్ లేదా విజయవాడలో నిర్వహించే సమీక్షలకు హాజరు కావాలంటూ ఆదేశాలు వస్తున్నాయి. దీంతోపాటు హైదరాబాద్‌లో సమీక్షలంటూ నివేదికలు తీసుకు రమ్మంటున్నారు. రోజుకో రూపంలో రోజుకో విధంగా నివేదికలు ఇవ్వాల్సి వస్తోందని దిగువస్థాయి అధికారులు వాపోతున్నారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్లడం అదనం. ఇలా నిధుల్లేని పాలనలో అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. జిల్లాలో ఏ అధికారిని పలకరించినా ‘ఎందుకొచ్చిన సమీక్షలండీ’ అని పెదవి విరుస్తున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు వత్తిడి పెరిగిపోతోందని, ఎన్ని నివేదికలు పంపుతున్నా నిధులు రావడం లేదని వాపోతున్నారు. కార్యాలయంలో కూర్చుని పనులు చక్కబెట్టుకోలేకపోతున్నామని, ప్రస్తుత సర్కారు పాలనలో ఎప్పుడూ లేని వింత పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన చెందుతున్నారు. వారంలో ఐదు రోజులపాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నామని, సమాచారాన్ని దిగువస్థాయికి చేరవేయలేకపోతున్నామని ఓ మునిసిపల్ కమిషనర్ వ్యాఖ్యానించారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు.