
పనులు ఫుల్.. నిధులు నిల్..
నత్తనడకన సీఎం క్యాంపు కార్యాలయ పనులు
నిధులు మంజూరు చేయని ఆర్థికశాఖ
ప్రారంభోత్సవంతోనే సరి
విజయవాడ: సీఎం క్యాంపు కార్యాలయ మరమ్మతులకు నిధుల గ్రహణం పట్టింది. ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఆర్భాటంగా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించినా.. రావాల్సిన బిల్లులు రాకపోవడంతో పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి.
రూ.కోటి బిల్లులు బకాయి
నగరంలోని నీటి పారుదలశాఖ కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చాలని నిర్ణయించడంతో పాత భవనాన్ని పూర్తిగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్యాకేజీలో భాగంగా పటేల్ ఇంజినీరింగ్ కంపెనీ ఇందుకు ముందుకు వచ్చింది. అయితే, మరమ్మతులకు ఆ సంస్థను పక్కన పెట్టిన కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఏ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి మరమ్మతులు చేయించిన రవి అనే కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు వేగవంతంగా చేయమని ఆదేశించారు.
తొలివిడత సుమారు రూ.5కోట్లు ఖర్చవుతుందని నిర్ణయించారు. కాంట్రాక్టర్ కోటి రూపాయలు ఖర్చుచేసి పనులు చేశారు. ఈ పనులకు బిల్లులను ఇక్కడి ఇరిగేషన్ అధికారులు ఆమోదించి హైదరాబాద్‌కు పంపగా, అక్కడ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆమోదించి రాష్ట్ర ఆర్థికశాఖకు పంపినట్లు సమాచారం. అయితే, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ ఈ బిల్లులను ఆమోదించకుండా పక్కన పెట్టారని తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉండటంతో బిల్లులు మంజూరుకాలేదని తెలిసింది. ఈ బిల్లులు మంజూరు చేయాలంటూ కలెక్టర్ బాబు.ఏ లేఖలు రాసినప్పటికీ ఆర్థికశాఖ నుంచి స్పందన రాలేదు. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం మరమ్మతుల బిల్లుల్నే మంజూరు చేయకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రెండు గదులతో ప్రారంభం
వాస్తవంగా ఈనెల 2వ తేదీన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఆ తరువాత 6వ తేదీ.. 8వ తేదీ.. అంటూవాయిదా వేశారు. 8వ తేదీన కూడా కేవలం సీఎం కూర్చునే గది, దాని వెనుకవైపు మరో గదిని మాత్రమే అధికారులు సిద్ధంచేసి సీఎంతో ప్రారంభింపజేశారు. సీఎం క్యాంపు కార్యాలయం పూర్తయితే ఏవిధంగా ఉంటుందో ఊహాచిత్రాలను ప్రదర్శించారు. క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం అయిపోవడంతో అధికారులు, కాంట్రాక్టర్ ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు సీఎం కాన్ఫరెన్స్ రూమ్, సిబ్బంది కూర్చునే గదులు, ఆయన సెక్రటరీకి స్పెషల్ రూమ్, లిప్టు, డ్రెయినేజీ, విద్యుద్దీపాల అలంకరణ.. ఇలా అనేక పనులు చేయాల్సి ఉంది. అయితే, బిల్లులు మంజూరు కాకుండా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడానికి కాంట్రాక్టర్ సుముఖంగా లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే తరహాలో సాగితే మరో ఆరు నెలలకు కూడా క్యాంపు కార్యాలయం అందుబాటులోకి రాకపోవచ్చు.
ఈఈల చేతులు మారి..
వాస్తవంగా నీటిపారుదల ప్రాంగణం మొత్తానికి కేసీ డివిజన్ ఈఈ రవికుమార్ ఇన్‌చార్జిగా ఉంటారు. ప్రాంగణంలో ఏ నూతన నిర్మాణాలు చేపట్టాలన్నా, మరమ్మతులు చేయాలన్నా ఆయన అనుమతులే తీసుకోవాలి. సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి అయిన కొన్ని బిల్లుల్ని ఆయనే మంజూరు చేశారు. ఆ తరువాత బిల్డింగ్‌లో జరుగుతున్న అనేక మార్పులు చేర్పులు ఆయన దృష్టికి రాకుండానే జరిగిపోయాయి. దీంతో ఆయన బిల్లులపై సంతకాలు పెట్టడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో క్యాంపు కార్యాలయ పనుల వరకు ఈఈ రవికి బదులుగా కేఈ డివిజన్ ఈఈ సత్యనారాయణకు ఎస్‌ఈ రామకృష్ణ బాధ్యతలు అప్పగించారు. సత్యనారాయణ కూడా ఆచీతూచి అడుగులు వేస్తూ, బిల్లుల గోల తన మెడకు చుట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నారు.