సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకైన ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టిందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్యాప్తునకు ఆదేశించారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్‌తో అత్యవసర సమావేశం అనంతరం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెల్లవారు జామున 3.30 గంటలకు గ్యాస్ లీక్ కాగా మూడు గంటల్లోనే పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకువచ్చిందీ ఈ సందర్భంగా ఆయన వివరించారు.
► విషవాయువు వెలువడిన విషయాన్ని స్థానికులు తెల్లవారుజామున డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రక్షక్ మొబైల్ పోలీసులు కేవలం పది నిముషాల్లోనే ఘటన స్థలానికి వెళ్లారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా 4.30 గంటల ప్రాంతంలో స్వయంగా వెళ్లి పరిశీలించి సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులను తరలించి సహాయక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించాం.
► ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని తలుపులు పగలగొట్టి ఆస్పత్రులకు తరలించి రక్షించాం. మూడు గంటల్లోనే గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చాం. కొందరు పోలీసులు కళ్లు తిరుగుతున్నా, వికారం వచ్చినా ఇబ్బందిపడుతూనే ప్రజల ప్రాణాలను కాపాడారు.
► నేషనల్ డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడాయి. విజయవాడ నుంచి కూడా ఫోరెన్సిక్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లను పంపించాం.
► ఉదయం 3.30గంటలకు ప్రమాదం జరిగితే తక్షణం స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రతిపాదిక చర్యలు చేపట్టింది. సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించి ఉదయం 6.30 గంటలకు మామూలు పరిస్థితిని తీసుకుని రాగలిగింది.
3 గంటల్లోనే అదుపులోకి..
Published Fri, May 8 2020 4:28 AM | Last Updated on Fri, May 8 2020 4:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment