మాజీ పోలీస్ బాస్‌లతో డీజీపీ ఆత్మీయ సమావేశం
అనుభవాలను పంచుకున్న తాజా, మాజీ అధికారులు
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు మంగళవారం పలువురు మాజీ డీజీపీలతో తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కలయికలో 13 మంది పోలీసు మాజీ బాస్‌లకు ప్రసాదరావు విందు ఇచ్చారు. దీనికి ఆనందరామ్, ఆర్.ప్రభాకర్‌రావు, తాళ్లూరి సూర్యనారాయణ రావు, ఎంవీ భాస్కరరావు, రాగాల, ఎమ్మెస్ రాజు, విజయరామారావు, హెచ్‌జే దొర, పేర్వారం రాములు, స్వరణ్‌జిత్‌సేన్, అజిత్ కుమార్ మహంతి, కె.అరవిందరావు, దినేష్‌రెడ్డి వంటి మాజీ డీజీపీలు పలువురు హాజరయ్యారు.
వీరు డీజీపీ ఆఫీసులోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, చాంబర్లను వీక్షించారు. పాత తరం అధికారులు కొత్త పరిజ్ఞానం పని విధానం తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. ఉల్లాసంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ బాస్‌లు తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి చివరి డీజీపీగా ప్రసాదరావు నిర్వహించిన పాత్ర, శాంతి భద్రతలను అదుపు చేయడంలో తీసుకున్న చర్యలను మాజీలు ప్రశంసించారు. ఈ సందర్భంలో పలువురు ఉన్నతాధికారులు కలిసి వారితో తమ గతానుభవాల్ని గుర్తుచేసుకున్నారు.