ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు, పశు పోషణలో నూతన ఆవిష్కరణలపై ఆయన పాడి రైతులకు అవగాహన కల్పించడంలో చేసిన విశేష కృషికి గాను ‘ఉత్తమ విస్తరణ అధికారిగా’ జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారత ప్రభుత్వ సంస్థ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ సదస్సులో ఈ అవార్డును అందుకోనున్నారు.
ప్రస్తుతం డాక్టర్ ప్రసాదరావు విశాఖ జిల్లా పశు సంవర్థకశాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ శిక్షణ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకునేలా చేయడం, పాడి పశువులు, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంలో కృషి చేస్తున్నారు.
దీంతో పాటు ప్రభుత్వ పథకాలపై ఆయన లఘు చిత్రాలు, స్వీయ రచనలు చేయడంతో పాటు వీడియోలు రూపొందించారు. వాటి ద్వారా పాడి రైతులకు సులువైన పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంతవరకు ఆయన ఆరు పుస్తకాలు, 200 పైగా వ్యాసాలు రాశారు. ప్రసాదరావు మాట్లాడుతూ యూ ట్యాబ్ చానల్ పెట్టి 140 వీడియోలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment