అనుక్షణం అప్రమత్తం
- ప్రతి వాహనాన్ని తనిఖీ చేయండి
- ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రెట్టింపు బందోబస్తు
- డీజీపీ ప్రసాదరావు ఆదేశం
- ఉత్తరాంధ్ర జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: ‘ఈ ఎన్నికలు పోలీసుశాఖకు ప్రతిష్టాత్మకం. ఎన్న డూ లేనివిధంగా ఒకేసారి మూడు ఎన్నికలు వచ్చాయి. ఎటువంటి అల్ల ర్లు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోండి. మద్యం, డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయండి.
ఉత్తరాంధ్ర జిల్లాలకు మావోయిస్టుల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటి నుంచి కూంబింగ్ ముమ్మరంచేసి మావోయిస్టులపై ఆధిపత్యం సాధించండి’ అని పోలీస్ ఉన్నతాధికారులకు డీజీపీ ప్రసాదరావు సూచించారు. వరుసగా మున్సిపల్, జెడ్పీ, అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఆయన ఆదివారం విశాఖలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఎస్పీలు, విశాఖ రేంజ్ డీఐజీ, నగర పోలీస్ కమిషనర్ తదితరులతో సమావేశమయ్యారు.
ఉత్తరాంధ్రలో పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలపై డీజీపీ జిల్లాల వారీగా సమీక్షించారు. మావోయిస్టుల ప్రభావం మూడు జిల్లాలకు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాలకన్నా మావోయిస్టు ప్రభావిత నియోజక వర్గాల్లో బందోబస్తు రెట్టింపుస్థాయిలో మోహరించాలని సూచించారు. అదే సమయంలో మావోయిస్టుల ప్రభావం తగ్గించడానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నారో ఆయా ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఎన్నికలకు ఎంతో సమయం లేనందున కూంబింగ్ ముమ్మరం చేయాలన్నారు. ప్రత్యేక బలగాలు, సీఆర్‌పీఎఫ్ బలగాలతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సాయంతో మావోయిస్టులను మట్టుబెట్టాలని ఆదేశించారు. అదే సమయంలో ఏజెన్సీ పరిధిలోని పోలీసుస్టేషన్ల ఆధునికీకరణపై చర్చ జరిగింది. చాలా స్టేషన్లకు ఏజెన్సీల్లో కనీస సమాచార వ్యవస్థ లేకపోవడం బలహీనంగా మారుతున్న నేపథ్యంలో వీటిని సమకూర్చుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నందున హెలికాప్టర్లద్వారా కూంబింగ్, ఇతర ఎన్నికల పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ దుగ్గల్ వివరించారు. అనంతరం డీజీపీ వీరిని ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాల వారీగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వివరాలపై అధికారులకు పలు సూచనలు అందించారు.