
సాక్షి, గుంటూరు : బ్రిటిష్ వారితో పోరాడాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాద్ రావు విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఏం చెప్పిన జనం నమ్ముతారులే అనే నియంతృత్వ పోకడలతో చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. బ్రిటిష్ వారితో టీడిపీ యుద్దం చేసిందని చెప్పటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. జీతభత్యాలు లేకుండా స్వచ్ఛంగా పనిచేసే కార్యకర్తే నిజమైన ప్రజాసేవకుడని తెలిపారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. పంచాయితీ ఎన్నికలకు వచ్చినంత పోలింగ్ శాతం, అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చేలా చూడాలని, బూత్ స్థాయిలో జరిగే అన్ని రాజకీయ పరిణామాలను పైస్థాయి నాయకులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. తన అద్భుతమైన పరిపాలన, పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చురగొన్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేవలం తన పార్టీ వారికి తప్ప మరెవరికీ ప్రభుత్వ పథకాలు అందించట్లేదని పేర్కొన్నారు.