
'అవును.. కిరణ్ సర్కార్ ను కాపాడాం'
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన మాట వాస్తమేనని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఒప్పుకున్నారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశామని శాసనసభలో చెప్పారు. తమ పార్టీ గుర్తుపై నెగ్గిన ఎమ్మెల్యేలకే విప్ జారీ చేశామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు విప్ జారీచేసి మరీ కాంగ్రెస్ సర్కారును కాపాడిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు.
దీనిపై ధూళిపాళ్ల స్పందిస్తూ వైఎస్ఆర్ సీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వటం ఇష్టంలేకే కిరణ్ సర్కారును కాపాడామని వెల్లడించారు. సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలకే విప్ జారీ చేశామని, మీకేంటి నొప్పి అని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు. మీకేంటి నొప్పి అంటూ రెట్టించడంతో సభలో గందరగోళం రేగింది. స్పీకర్ జోక్యంతో సభ సద్దుమణిగింది.