
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో టీడీపీ-బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌లు పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో గంటా.. ‘బీజేపీ అంటేనే మనుషులను కోసుకుని తినే పార్టీ’ అని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే: ఏపి విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియపై బుధవారం మండలిలో స్వల్ప చర్చ జరిగింది. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. 17 జాతీయ సంస్థలకుగానూ ఏపీ ప్రభుత్వం 3508 ఎకరాలు కేటాయించిందని, ప్రస్తుతానికి ఐదు విద్యా సంస్థల్లో క్లాసులు నడుస్తున్నాయని,అయితే శాశ్వత నిర్మాణాలు పూర్తికానందున వాటిని తాత్కాలిక భవనాల్లోనే తరగతులు జరుగుతున్నాయని తెలిపారు.
సంచలన వ్యాఖ్యలు: ‘‘బిల్డింగ్స్ లేని కారణంగా సీట్లు నిండటంలేదు. నిర్మాణాలు చేపట్టమని కేంద్రాన్ని అడిడితే స్థలం ఇవ్వలేదని సాకులు చెబుతోంది. చాలా సార్లు కేంద్ర మంత్రిని కలిసినా ఫలితంరాలేదు. అధ్యక్షా.. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఏపీపై కక్షకట్టి అన్యాయం చేస్తున్నది. కోడి కోసుకుని తింటే అది చికెన్ పార్టీ, మేకను కోసుకుని తింటే అది మటన్ పార్టీ, అదే మధ్యతరగతి మనిషిని కోసుకుని తింటే అది భారతీయ జనతాపార్టీ’’ అని మంత్రి గంటా వ్యాఖ్యానించారు.
బీజేపీ ఫైర్: తమ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి గంటాపై బీజేపీ సభ్యులు ఫైరయ్యారు. ‘‘తలుచుకుంటే మీకన్నా ఎక్కువే అనగలం. కానీ ఇది అసెంబ్లీ అన్న సంగతి మర్చిపోవద్దు. మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత అనుచితంగా మాట్లాడటం సరికాదు’’ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment