అధికార పక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వండి
హైదరాబాద్ : అసెంబ్లీలో తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని మరోవైపు అధికార పక్షం కోరింది. సంఖ్యా బలానికి అనుగుణంగా తమకూ మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కోరారు. ప్రధాన ప్రతిపక్షం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదన్న ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
కాగా బడ్జెట్‌పై మాట్లాడేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రధాన ప్రతిపక్ష డిమాండ్‌ను శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు విభేదించారు. ఇప్పటికే నిర్ణీత సమయం కంటే.. ఎక్కువే ప్రధాన ప్రతిపక్షం మాట్లాడిందని ఆయన చెప్పారు. వీలుంటే తన సమాధానికి ముందు కాస్త సమయం ఇవ్వొచ్చని సూచించారు.
అసెంబ్లీ తొలిసారి పది నిమిషాలు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం కాగానే.. బడ్జెట్‌పై చర్చ మొదలు పెట్టారు. మాట్లాడాల్సిందిగా గొల్లపల్లి సూర్యారావును కోరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన ప్రతిపక్షం.. నిన్నటి తమ ప్రసంగం ఇంకా పూర్తి కాలేదని.. కాబట్టి ఆ ప్రసంగాన్ని పూర్తి చేసేందుకు కాసేపు టైమ్ ఇవ్వాలని కోరారు. అయితే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇచ్చేందుకు స్పీకర్ తిరస్కరించారు.